జూన్ 8-11 తేదీల్లో పోస్టింగ్ ఉత్తర్వులు
అభ్యర్ధుల వయో పరిమితి 42 సంవత్సరాలు
మూడేళ్ల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలను చేపట్టింది. డిఎస్సీ2018 పరీక్షలను వచ్చే మార్చి నెల 23,24,26 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సీ2018 నోటిఫికేషన్ ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. డిఎస్సీ2018 షెడ్యూలును ఆయన ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్ధులకు వయోపరిమితి 42 సంవత్సరాలుగా నిర్దేశించారు.
ఆ షెడ్యూలు ప్రకారం డిఎస్సీకి హాజరు కాగోరే అభ్యర్ధులు ఈ నెల 26వ తేదీనుంచి వచ్చే ఫిబ్రవరి 7వ తేదీవరకు ఆన్ లైన్లోగానీ, మీసేవ, ఈసేవల ద్వారాగానీ ఫీజు చెల్లించవచ్చు. ఈ నెల 26వ తేదీనుంచి ఫిబ్రవరి 8వ తేదీవరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి తొమ్మిదో తేదీన హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్షలు మార్చి 23,24, 25 తేదీల్లో జరుగుతాయి.
పరీక్షలకు సంబంధించిన కీని ఏప్రిల్ తొమ్మిదో తేదీన విడుదల చేస్తారు. కీపై ఏవైైనా అభ్యంతరాలుంటే ఏప్రిల్ 10 నుంచి 16వరకు ఆన్ లైన్లో స్వీకరిస్తారు. తుది కీని ఏప్రిల్ 30న విడుదల చేస్తారు. మెరిట్ లిస్టును మే 5న ప్రకటించి.. ముసాయిదా సెలక్షన్ జాబితాలను అదే నెల 11వ తేదీన అందుబాటులో ఉంచి అభ్యర్ధులకు సమాచారం అందిస్తారు.
ఎంపిక చేసిన అభ్యర్ధుల ఒరిజినల్ సర్టిఫికెట్లను మే 14 నుంచి 19 వరకు జిల్లాస్థాయిలో పరిశీలిస్తారు. మెడికల్ సర్టిఫికెట్లు దాఖలు చేయవలసినవారు మే 31వ తేదీన డీఈవోలకు సమర్పించాలి. జూన్ 1 నుంచి 6 వరకు తుది ఎంపిక జాబితాలను జిల్లా సెలక్షన్ కమిటీలు ఖరారు చేస్తాయి. చివరిగా జూన్ 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. జూన్ 12వ తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంనుంచే ఉపాధ్యాయులంతా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఈ షెడ్యూలును నిర్దేశించుకున్నారు.