ఏపీ పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో చంద్రబాబు
విజయవాడ కృష్ణానదీ గర్భంలో ఉన్న భవానీ ద్వీపాన్ని మాల్దీవుల తరహాలో అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం రాత్రి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకం, సాంస్కృతిక, వారసత్వ బోర్డు సంచాలకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన ప్రాజెక్టుల పురోగతిని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను, వివిధ పథకాల బృహత్తర ప్రణాళికా ప్రతిపాదనలను ఆయన సమీక్షించారు.
భవానీ ఐలెండ్ అభివృద్ధికి సీబీటీ కన్సార్టియం, స్టుడియో పాడ్ (PoD) బృహత్తర ప్రణాళికల ప్రతిపాదనలు సమర్పించినట్టు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. కేవలం 4 కోట్ల జనాభా ఉన్న మాల్దీవులలో 30 నుంచి 40 సీ ప్లేన్లు ఉన్నాయని వివరించారు. ఏటా ఐదులక్షల మందికి పైగా సందర్శిస్తున్న భవానీ ద్వీపాన్ని ఆ తరహాలో అభివృద్ధి చేసి ఆదాయవనరులను పెంచుకొవాల్సి ఉందన్నారు. ఒకటో ఐలెండ్ (795 ఎకరాలు), 3 వ ఐలెండ్ (515 ఎకరాలు), మిగిలిన ఏడు ద్వీపాల అభివృద్ధిని మొదటి దశలో చేపట్టాలని ప్రతిపాదించారు.
సాంస్కృతికం, వారసత్వం, ఎంటర్ టైన్ మెంట్, ఎకో, ఎమ్యూజ్ మెంట్ ఇలా ఏడు థీములను సిఎం ప్రతిపాదించారు. భవానీ ద్వీపాన్ని ఉత్తమ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని కోరారు. భారత చరిత్ర, సంస్కృతిని అధ్యయనం చేసి స్థానిక అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకుని భవానీ ద్వీపాన్ని అభివద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వినోద కార్యక్రమాలపై తనకు మరిన్ని వివరాలు కావాలని కోరారు. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రీకులను అనుసరించి ఫుడ్ కోర్టులలో ఆహార పదార్ధాల జాబితా తయారు చేయాలని, భవానీ ద్వీపం, నదీ పర్యావరణానికి హాని కలగని రీతిలో ఫుడ్ కోర్టులు, వినోద కార్యక్రమాలుండాలని సూచించారు.
అరకు, విశాఖ అదరాలి
విశాఖలోని మధుర వాడ కొండపై రెండు వందల ఎకరాలను పర్యాటక ఆకర్షక కేంద్రంగా రూపొందించే బృహత్తర ప్రణాళికను సమీక్షిస్తూ విశాఖలో బీచ్ రిసార్టులు మరిన్ని రావాలని, ఆకర్షణీయమైన ఆక్వేరియంలు ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. పర్యాటక ప్రదేశాలను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసి విభిన్న పర్యాట హంగుల ఏర్పాటుకు డెవలపర్స్ కోసం అన్వేషించాలని, పర్యావరణ సమతౌల్యత దెబ్బతినకుండా ప్రాజెక్టులను నెలకొల్పుదామని అన్నారు.
అరకులోయను ఏటా సగటున ఐదు లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని, కానీ వారు ఒక్కరోజు కూడా ఇక్కడ బసచేసే అవకాశాలు లేవని చెప్పారు. పర్యాటకులు కనీసం మూడు రోజులు బసచేసే విధంగా ఆకర్షణలు ఉండాలని సూచించారు. అరకు అభివృద్ధికి రూ. 198 కోట్లతో అంచనా ప్రణాళిక రూపొందించామని, కేంద్రం రూ.100 కోట్లు ఇస్తుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎక్కడ పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటయినా స్థానికులకు ఉద్యోగావకాశాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
25 వేల హోటల్ గదులు అవసరం
మధురవాడ కొండపైన 5 స్టార్ హోటల్ ఏర్పాటుకు పార్కు హోటల్ తన ప్రతిపాదనలు సమర్పించిందని అధికారులు వివరించగా, పోటీ పెట్టి మంచి డెవలపర్ ను ఎంపిక చేసుకుందామన్నారు. 240 ఎకరాల్లో 3 హోటళ్లు ఏర్పాటు కావాలన్నారు. పార్కు, రాడిసన్, హిల్టన్ సంస్థలు తమ హోటళ్ల ఏర్పాటుకు సంసిద్ధత తెలిపాయని అన్నారు. వచ్చే ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి తగినట్లుగా 25,000 హోటల్ గదులు కావాలని, కానీ ప్రస్తుతం 2500 కూడా లేవని ముఖ్యమంత్రి అన్నారు.
మంచి హోటళ్లు వస్తే పర్యాటక రంగం అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని సిఎం చెప్పారు. విజయవాడలో 2018 మార్చి 31న తాము తమ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని హోటల్ షెరటన్ ప్రతినిధి సిఎంకు చెప్పారు. శంఖుస్థాపనకు రావలసిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. దీనికి సీఎం సమ్మతించారు.
కళింగ పట్నంలో క్లబ్ మహీంద్ర 15 ఎకరాల్లో రూ. 200 కోట్ల పెట్టుబడితో బీచ్ రిసార్ట్స్ అభివృద్ధికి ప్రతిపాదించిందని, అందులో 200 విలాస వంతమైన ఆతిథ్య విభాగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అరకు ట్రైబల్ సర్క్యూట్ ఎకో టూరిజంపైనా సమావేశంలో చర్చ జరిగింది. బొర్రాగుహలు, అరకు వ్యాలీ, అనంతగిరి, చాపరాయి, లంబసింగి లను కలిపి సర్క్యూట్ గా అభివృద్ధి చేయవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ఐఎన్ఎస్ విరాట్ లో 148 గదుల హోటళ్ల ఏర్పాటుకు, నేవల్ మారీటైమ్ ఇన్ స్టిట్యూట్, వినోద కేంద్రం, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించారు.