మీ అబ్బ సొమ్మా… తాగి మాట్లాడావా? లోకేష్ పై పోసాాని మండిపాటు

1 0
Read Time:7 Minute, 49 Second

నంది అవార్డులపై నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ (ఎన్ఆర్ఎ)లు మాత్రమే విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ మీడియాతో, చంద్రబాబు పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా వచ్చిన మీడియా కథనాలను ఉటంకిస్తూ పోసాని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. నిన్న లోకేష్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మంగళవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ పోసాని కౌంటర్ ఇచ్చారు. లోకేష్ ను విమర్శించడంతో ఆగని పోసాని తెలంగాణ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంపైనా సెటైర్లు వేశారు. ఒక దశలో చంద్రబాబు పరిపాలనాదక్షుడని, దేశంలోనే గొప్ప నాయకుడని అంటూనే అవార్డుల విషయంలో ఆక్షేపణ తెలిపారు.

హైదరాబాద్ లో ఉన్నవాళ్ళను ఎన్ఆర్ఎలుగా మాట్లాడటం, ఆంధ్రలో ఆధార్ కార్డు లేనివాళ్ళనే వ్యాఖ్య చేయడం పట్ల స్పందిస్తూ ‘మమ్మల్ని తెలుగు రోహింగ్యాలను చేద్దామనుకున్నారా’ అని పోసాని ప్రశ్నించారు. 2024వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ తర్వాత కూడా అక్కడే నివాసం ఉండవచ్చని ఉద్ఘాటించారు. లోకేష్ చదువుకున్నాడా? ఇలాంటి వైఖరి ఉన్న లోకేష్ ముఖ్యమంత్రి అయితే మేం బతికాంటామా? మమ్మల్ని బతకనిస్తారా? తెలంగాణ వాళ్ళు కాదంటే మేము తెలుగు రోహింగ్యాలమేగా.. లోకేష్ కు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? అని పోసాని ధ్వజమెత్తారు.

‘లోకేష్ నువ్వు తాగి మాట్లాడావా? మా మీద నీచ వ్యాఖ్యలా.. మమ్మల్ని తెలుగు రోహింగ్యాలను చేస్తావా? మమ్మల్ని కొట్టించదలచుకున్నావా.. బొంబొయిలో శివసేనవాళ్ళు కొట్టినట్టు? మతకలహాలు రేపదలచుకున్నావా? ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొడతావా? మీకు హైదరాబాద్ లో ఇళ్ళు లేవా? మీ అత్త, బంధువులెవరూ ఇక్కడ నివాసం ఉండటం లేదా? ఇక్కడ పన్నులు కట్టడంలేదా? వారికి వ్యాపారాలు.. షాపింగ్ కాంప్లెక్స్ లు లేవా? మీరేమో ఇక్కడే వ్యాపారాలు చేస్తూ ట్యాక్స్ కట్టొచ్చు… విజయవాడలో రాజకీయాలు చేయవచ్చు.. మేము మాత్రం ఉండకూడదా?’ అని పోసాని మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

విమర్శిస్తే నంది అవార్డులనే ఎత్తివేస్తామంటున్నారని ఆక్షేపించిన పోసాని ‘ఇవి మీ అబ్బ సొమ్మా’ అని దుయ్యబట్టారు. నీచమైన పద్ధతుల్లో ఇచ్చే అవార్డును తాను తీసుకోనని ప్రకటించారు (టెంపర్ సినిమాకుగాను పోసానికకి ఉత్తమ సహాయ నటుడి అవార్డు వచ్చింది). పోసాని కమ్మవాడు కాబట్టే ఈ అవార్డు ఇచ్చి ఉంటారనే అనుమానం ఎవరికైనా రావచ్చని, అందుకే ఆ అవార్డు తనకు వద్దని చెప్పారు. తాజాగా ప్రకటించిన అవార్డులను రద్దు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు ఐవీఆరెస్ పద్ధతిలో అభిప్రాయాలు తీసుకోవాలని పోసాని డిమాండ్ చేశారు. అప్పుడు తనకు రాకున్నా సంతోషమేనని, అప్పటిదాకా నంది ముట్టనని స్పష్టం చేశారు.

అవార్డుల ఎంపికలో లోపం జరిగిందనే విషయాన్ని గుర్తించే చంద్రబాబు ఐవీఆరెస్ సర్వే అన్నారని పోసాని పేర్కొన్నారు. అవార్డుల జ్యూరీలో 12 మంది సభ్యులుంటే అందులో 10 మంది కమ్మవారే ఉంటారా? ఎవరైనా అనుమానించరా? అని పోసాని ప్రశ్నించారు. చంద్రబాబు పరిపాలనా దక్షుడని, దేశంలోనే గొప్ప నాయకుడని ప్రశంసిస్తూ…‘మీరు సమర్ధులు.. అందులో సందేహం లేదు. మీరు కళ్ల ముందుఅనేకం జరిగాయి. పేపర్ లీకైనప్పుడు పరీక్షలు రద్దు చేసేవాళ్లు కదా?  అలాగే నంది అవార్డులను కూడా రద్దు చేయండి. ఈ కమిటీని రద్దు చేసి కొత్తగా అవార్డులకు ఎంపిక చేయకపోతే నేను చచ్చేవరకు అవార్డు ముట్టను’ అని చెప్పారు.

విమర్శను స్వీకరించరా?

విమర్శను స్వీకరించరా? అని లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునూ పోసాని ప్రశ్నించారు. ‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించలేదా? ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లు విమర్శించారు? మిమ్మల్ని కొట్టారా? నాన్ లోకల్ అని చిత్తూరు పంపారా? మాదాకా వచ్చినప్పుడు నాన్ లోకల్ ఏంటి? మమ్మల్ని ఏం చేయదలచుకున్నావ్?’ అని మండిపడ్డారు. ‘విమర్శిస్తే నందులివ్వం అంటారా. లోకేష్… నీ పేరుతో బంగారు నంది పెట్టుకో. కమ్మవాడికే ఇవ్వదలచుకుంటే ఇవ్వు. నీకు నచ్చినవాడికి ఇవ్వదలచుకుంటే ఇవ్వు’ అని వ్యాఖ్యానించారు.

అవార్డులకు ప్రాంతీయత ఎందుకు?

నంది అవార్డుల అంశంలో లోకేష్ స్థానికత, ప్రాంతీయతను ప్రస్తావించడం ఏమిటని పోసాని అభ్యంతరం తెలిపారు. ‘మమ్మల్ని నాన్ లోకల్ చేస్తావా? రేపు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టులు ఇస్తారా? తెలుగుదేశానికి ఓట్లేసేవారినే ఆంధ్రాలో ఉండనిస్తారా?’ అని ప్రశ్నించిన పోసాని…. కేసీఆర్ మహానుభావుడని, ఆయన కాళ్ళు కడిగి మంచిగా ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు. లోకేష్ వంటివారి వల్లనే తెలంగాణ వాళ్లలో వ్యతిరేకత వచ్చిందని, కానీ కేసీఆర్ ఆంధ్రావాళ్లను వెళ్లమనలేదని చెప్పిన పోసాని.. పదేపదే కేసీఆర్ ను ప్రశంసించారు. ఆయనకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.

‘రాజధాని అనగానే అక్కడ పొలాలు కొనుక్కున్నారు. మేం పిచ్చోళ్లలా ఇక్కడే ఉన్నాం. అప్పుడు హైటెక్ సిటీ అనగానే కొన్నారు. ఇప్పుడు అమరావతి దగ్గర ఎవరికి భూములున్నాయి? టీడీపీ నాయకులకా.. మాకా?’ అని పోసాని ప్రశ్నించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply