సైన్యం తిరుగుబాటు తర్వాత జింబాబ్వేలో అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ఎలా ఉన్నాడు? ఆయన సురక్షితంగానే ఉన్నాడనడానికి రుజువుగా ఆ దేశ అధికారిక పత్రిక జింబాబ్వే హెరాల్డ్ తాజాగా కొన్ని ఫొటోలను ప్రచురించింది. 93 సంవత్సరాల ముగాబే ఆర్మీ కమాండర్ కాన్ స్టాంటినో చివెంగాతోపాటు దక్షిణాఫ్రికా ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా తీసిన చిత్రాలివి. ఆ దేశ కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం స్టేట్ హౌస్ లోనే ఈ భేటీ జరిగింది.
జింబాబ్వేలో ముగాబే, సైన్యం మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అధ్యక్షుడు సైన్యం అధీనంలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ముగాబే గత వారం తన డిప్యూటీ ఎమర్ సన్ ఎం.నంగగ్వాను తప్పించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఎమర్ సన్ కు మద్ధతుగా మిలిటరీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో జింబాబ్వేలో మిలిటరీ తిరుగుబాటు చేసిందంటూ ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చాయి.