మూడీస్ మరో మాట… బడ్జెట్ లోటు పెరుగుతుంది

1 0
Read Time:3 Minute, 45 Second

2017-18 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ లోటు పెరుగుతుందని రేటింగ్ ఏజన్సీ మూడీస్ అంచనా వేసింది. పన్ను వసూళ్లు తగ్గడం, ప్రభుత్వ వ్యయం పెరగడం దీనికి కారణాలుగా పేర్కొంది. అయితే, ఈ ఏడాదికి తగ్గినా పన్నుల ఛత్రాన్ని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల వచ్చే సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడుతుందని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభమైన  తర్వాత కేంద్ర రాష్ట్రాల పన్ను ఆదాయాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ అంచనా వెలువడింది.

అమెరికా ప్రధాన కేంద్రంగా పని చేసే మూడీస్ ఇటీవల ఇండియా క్రెడిట్ రేటింగ్ స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఉపాధ్యక్షుడు (సావరిన్ రిస్క్ గ్రూపు) విలియం ఫోస్టర్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ ఆర్థిక గమనంపై మాట్లాడారు. ప్రస్తుత సంవత్సరం సాధారణ ప్రభుత్వ బడ్జెట్ లోటు జీడీపీలో 6.5 శాతం ఉంటుందని తాము ముందుగా అంచనా వేశామని, అయితే… రెవెన్యూ తగ్గి ప్రభుత్వ వ్యయం పెరిగిన నేపథ్యంలో లోటు లక్ష్యానికి మించిపోతుందని ఫోస్టర్ పేర్కొన్నారు.

జనరల్ బడ్జెట్ లోటులో కేంద్ర రాష్ట్రాల రెవెన్యూను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2017-18 బడ్జెట్ లోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.2 శాతంగా నిర్దేశించుకుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం. ఈ వ్యత్యాసం మొదటి ఆరు నెలల్లోనే వార్షిక లక్ష్యంలో 91.3 శాతానికి చేరింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో లోటు లక్ష్యాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే నెలలో సవరించనుంది. జీఎస్టీ ఆదాయం, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల్లోని వాటాల అమ్మకంపై అప్పుడు సమీక్ష నిర్వహిస్తారు.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తాత్కాలింగా (6.7 శాతానికి) తగ్గినా 2018-19లో 7.5 శాతానికి పెరుగుతుందని ఫోస్టర్ అంచనా వేశారు. సుస్థిర వృద్ధి రేటుతో భవిష్యత్తులో అప్పుల భారం తగ్గుతుందని ఫోస్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అప్పు-జీడీపీ నిష్ఫత్తి 68.6 శాతం ఉండగా ప్రభుత్వం నియమించిన ప్యానల్ ఒకటి 2023నాటికి 60 శాతానికి తగ్గించాలని సిఫారసు చేసింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థలోనూ, క్రెడిట్ రేటింగ్ విషయంలోనూ సానుకూల అంశాలతోపాటు ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయని ఫోస్టర్ చెప్పారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply