మొదటి బాంబు వేసేవరకు మాట్లాడొచ్చు..!

ఉత్తర కొరియాపై టిల్లర్ సన్ వ్యాఖ్య

ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలపై అమెరికా దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తుందని, అయితే అది “మొదటి బాంబు పడేవరకు” మాత్రమేనని అమెరికా స్టేట్ సెక్రటరీ టిల్లర్ సన్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన సీఎన్ఎన్ ఛానల్ లో దర్శనమిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా సమస్యను దౌత్య పరంగా పరిష్కరించాలని భావిస్తున్నట్లు టిల్లర్ సన్ చెప్పారు. “నేను ఇతరులకు చెప్పినట్లు.. మొదటి బాంబు పడేవరకు ఈ దౌత్య ప్రయత్నాలు కొనసాగుతాయి” అని ఆయన పేర్కొన్నారు.

అయితే, గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో చర్చల కోసం టిల్లర్ సన్ సమయం వృథా చేస్తున్నారని ట్రంప్ కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఆ తర్వాత ట్రంప్, కిమ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అమెరికా అధ్యక్షుడిగా ఐక్య రాజ్య సమితిలో చేసిన తొలి ప్రసంగం లోనే ట్రంప్.. ఉత్తర కొరియాను పూర్తిగా నిర్మూలిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత శ్వేత సౌధంలో మిలిటరీ అధికారులతో మాట్లాడుతూ.. “ఇది తుపాను ముందు ప్రశాంతత” అని వ్యాఖ్యానించారు.

మరో వైపు కిమ్ ధీటుగా స్పందిస్తూ అమెరికాను మసి చేస్తామని హెచ్చరించారు. “యుద్ధ పిపాసి” ట్రంప్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రదర్శనలకు కిమ్ పిలుపునిచ్చారు. అదే సమయంలో అమెరికా తన బలగాలను కొరియా ద్వీప కల్పం వైపు మళ్ళించడం ఆపలేదు. ఉత్తర కొరియా అభ్యంతరాలను పట్టించుకోకుండా దక్షిణ కొరియాతో ఉమ్మడి మిలిటరీ విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ నెల ప్రారంభంలో 80 యుద్ధ విమానాలతో కూడిన యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ ను దక్షిణ కొరియాకు పంపింది. ఈ నెల 20వ తేదీన అమెరికా సైనిక విన్యాసాలు జరిగే అవకాశం ఉంది.

Related posts

Leave a Comment