మోడీ గేమ్… అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్

రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..
మంగళవారం పార్లమెంటు ముందుకు..
50 శాతం దాటనున్న కోటా..
2019 ఎన్నికలకోసం ప్రధాని మాస్టర్ ప్లాన్ 

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ ఇంతకాలం రాష్ట్రాల డిమాండ్లను తోసిపుచ్చుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం… 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ ‘‘మాస్టర్ ప్లాన్’’ను ముందుకు తెచ్చింది. అదే ‘‘అగ్రవర్ణ రిజర్వేషన్‘‘. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన (ఈబీసీ) వారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ఓ బిల్లుకు సోమవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకటి లేదా రెండు నెలల్లో 2019 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనగా.. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలన కారణమైంది.

ప్రత్యక్ష నియామకాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్తించే ’’ఈబీసీ రిజర్వేషన్‘‘కు ఆదాయ పరిమితిని విధించారు. రిజర్వేషన్ కోరే ఈబీసీలకు వార్షికాదాయం రూ. 8 లక్షలకు మించకూడదు. ఐదు ఎకరాలకంటే తక్కువ పొలం ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. ఈ బిల్లు బ్రాహ్మణులు, బనియాలతోపాటు ముస్లింలు, క్రిష్టియన్లకు కూడా ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి విజయ్ సంప్లా వ్యాఖ్యానించారు.

ఈ నిర్ణయాన్ని రాజకీయంగా చూడకూడదని కేంద్ర మంత్రి చెబుతున్నారు. అయితే, ఉత్తరాదిన మూడు కీలక రాష్ట్రాల్లో ఓటమి తర్వాత… సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు తీసుకొస్తున్న ఈబీసీ రిజర్వేషన్ బిల్లును ‘‘ఎన్నికల గిమ్మిక్’’గా ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి. అగ్రవర్ణాలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి బీజేపీ వేస్తున్న ఎత్తుగడల్లో భాగమే ఈ ప్రయత్నమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

రేపు రాజ్యాంగ సవరణ బిల్లు 

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని 1992లో సుప్రీంకోర్టు పరిమితి విధించింది. ఆ తర్వాత 2010లో మరో తీర్పులో… పెంచవలసిన అవసరాన్ని నిర్ధారించే శాస్త్రీయ సమాచారం ఉంటే 50 శాతం దాటవచ్చని పేర్కొంది. 2011లో తొలిసారిగా సామాజికార్థిక కుల జనాభాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం… ఆ డేటాను ఇంతవరకు వెల్లడించలేదు. అగ్రవర్ణ (ఈబీసీ) కోటా బిల్లు ప్రకారం రిజర్వేషన్లు 49.5 శాతం నుంచి 59.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణలకు సవరణ చేయవలసి ఉంటుంది.

ఈబీపీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అగ్రవర్ణ రిజర్వేషన్ బిల్లు విషయాన్ని చివరివరకు రహస్యంగా ఉంచిన ప్రభుత్వం… పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి రోజున ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుండటం గమనార్హం.

రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలతోపాటు కనీసం 10 రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఎవరూ వ్యతిరేకించరని… వ్యతిరేకిస్తే వారిని అగ్రవర్ణాల్లో దోషులుగా నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా బీజేపీకి 2019 ఎన్నికల్లో అగ్రవర్ణాల్లో అసాధారణ మద్ధతు లభిస్తుందనే ఆశాభావం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.

రాష్ట్రాల డిమాండ్లకు ప్రత్యామ్నాయంగా…

వివిధ రాష్ట్రాలనుంచి వివిధ కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని వచ్చిన సిఫారసులకు సమాధానంగానే ఈ బిల్లును తెస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం అగ్రవర్ణాల్లో ఉన్న వివిధ కులాలను ఓబీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పించే దిశగా రాష్ట్రాలు చట్టాలను కూడా చేశాయి. ఆ రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూలు రక్షణ కూడా కోరాయి. అయితే, అగ్రవర్ణాలను ఓబీసీలలో చేర్చడానికి బలహీనవర్గాల నుంచి నిరసన ఎదురవుతోంది.

రిజర్వేషన్ కోటాను పెంచే దిశగానే రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నా… ఓబీసీలలో కొత్తగా కొన్ని కులాలను చేర్చడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఓబీసీల ప్రస్తావన లేకుండా… అగ్రవర్ణాలను ఆకట్టుకోవడానికి మోడీ ప్రభుత్వం ఓసీల పేరిటే రిజర్వేషన్లను కల్పించేందుకు సిద్ధమైంది. ఈ బిల్లు ఉభయతారకంగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

 

Related posts