రోహింగ్యాల జాతి నిర్మూలనకు పాల్పడ్డారని ఆరోపణ
ఐరాస మానవ హక్కుల కమిషన్ తరఫున నివేదిక వెల్లడి
మ్యాన్మార్ టాప్ మిలిటరీ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఒకటి సిఫారసు చేసింది. రోహింగ్యా ముస్లింల జాతి నిర్మూలనకు పాల్పడి దేశంనుంచి తరిమేశారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ నిర్ధారించింది. రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కమిషన్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల స్వతంత్ర మిషన్ నిజ నిర్ధారణ చేసి సోమవారం ఓ నివేదికను వెల్లడించింది. ఆ నివేదికలో మ్యాన్మార్ ఆర్మీ చీఫ్, సీనియర్ జనరల్ అయిన మిన్ ఆంగ్, మరో ఐదుగురు జనరళ్ల పేర్లున్నాయి.
మానవ హక్కుల హననం, జాతి నిర్మూలన నేరాలకు గాను ఆ ఆరుగురు జనరళ్లపై విచారణ జరిపాలని నివేదిక సూచించింది. పెద్ద ఎత్తున జరిగిన రోహింగ్యాల మారణకాండను పరిశీలిస్తే.. అది ‘ముందస్తు ప్రణాళిక’తోనే జరిగినట్టు అర్ధమవుతోందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అది ఆర్మీ చీఫ్ మార్గదర్శకత్వంమేరకే జరిగినట్టు సభ్యులు అభిప్రాయపడ్డారు.
గత ఏడాది ఆగస్టులో మ్యాన్మార్ లోని రఖినే రాష్ట్రంలో ఆర్మీ రోహింగ్యాలపై విరుచుకుపడి పెద్ద మొత్తంలో ప్రజలను చంపింది. గ్రామాలను తగులబెట్టి మిగిలిన ప్రజలను తరిమివేసింది. ‘అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ’ దాడులకు ప్రతీకారంగా ఆర్మీ మారణకాండకు దిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ మారణహోమం ఏడు లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు పారిపోవడానికి కారణమైంది. ఇది అతి పెద్ద సంక్షోభంగా మారింది.
రోహింగ్యాలను దేశం నుంచి తరిమేసే ఆపరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలోనే జరిగిందని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ఇందుకు మ్యాన్మార్ స్థానిక పోలీసు బలగాలు, బోర్డర్ గార్డ్ పోలీసులు సహకరించారు. ఆర్మీ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ సో విన్ ఆధ్వర్యంలోని దళాలు మరీ క్రూరంగా వ్యవహరించినట్టు కమిషన్ నివేదిక నిర్ధిష్టంగా పేర్కొంది. ‘రోహింగ్యాలపై జరిగిన లైంగిక దాడులన్నీ దాదాపు ఆర్మీ చేసినవే’ అని స్పష్టం చేసింది. ఆర్మీ ఆపరేషన్ ‘జాతి నిర్మూలన ఉద్దేశం’తో చేసినదేనని 20 పేజీల మానవ హక్కుల కమిషన్ నివేదిక కుండబద్ధలు కొట్టింది. దీనివెనుక మ్యాన్మార్ ప్రభుత్వం ఉందని కూడా పేర్కొంది.
మ్యాన్మార్ ఆర్మీపై విచారణకు తగినంత సమాచారం ఉందని, ఓ సాధికార న్యాయస్థానం రోహింగ్యాల జాతి నిర్మూలన నేరానికి ఆర్మీ అధికారులను బాధ్యులను చేయవలసి ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తమ ప్రయత్నానికి మ్యాన్మార్ ప్రభుత్వం సహకరించలేదని నిజనిర్ధారణ మిషన్ సభ్యులు చెప్పారు. మ్యాన్మార్ లో మానవ హక్కుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
ఆంగ్ సాన్ సూకీపై విమర్శ
‘శాంతి ధూత’గా పేరు పొందిన నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని కూడా మానవ హక్కుల కమిషన్ నివేదిక వదిలిపెట్టలేదు. అనధికార ప్రభుత్వ అధినేతగా ఉన్న సూకీ… రోహింగ్యాల మారణకాండను నిలువరించడానికి తన అధికారాన్ని ఉపయోగించలేదని, నైతిక బాధ్యతగా కూడా తీసుకోలేదని నిజ నిర్ధారణ నివేదిక తీవ్రంగా ఆక్షేపించింది. రోహింగ్యాల జాతి నిర్మూలన దాడులు, దేశం నుంచి తరిమివేయడంపై మ్యాన్మార్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది. తూర్పు ఆసియాలోని ఐదు దేశాలకు చెందిన 130 మంది పార్లమెంటు సభ్యులు మ్యాన్మార్ ప్రభుత్వంపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణ జరగాలని మూకుమ్మడిగా డిమాండ్ చేశారు.