దక్షిణ భారత సినిమా యవనికపై రజనీకాంత్ సూపర్ స్టార్. ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే! అయితే, రాజకీయాల విషయంలో ఆయన 100సార్లు మాట్లాడినా ఒక్కసారి కూడా స్పష్టత రాలేదు!! తాజాగా మరోసారి రాజకీయ చర్చకు తెర లేపారు. ‘రాజకీయాలకు నేను కొత్త కాదు. 1996 నుంచే రాజకీయాలు మాట్లాడుతున్నా’ అంటూనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగించారు. వెయ్యి మంది ముఖ్యమైన అభిమానులతో ఆరు రోజుల మేధోమథనాన్ని మంగళవారం ప్రారంభించిన రజనీకాంత్, ఆ కార్యక్రమం ముగిసే రోజున (ఈ నెల 31న) తన వైఖరి వెల్లడిస్తానని చెప్పారు.
1996 ఎన్నికల సందర్భంగా జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై గత రెండు దశాబ్దాల్లో కావలసినంత చర్చ జరిగింది. అయితే, రెండు ప్రాంతీయ ద్రవిడ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీకి ఎంతవరకు చోటు ఉంటుందన్న ప్రశ్నకు అప్పట్లో సమాధానం లేదు. 2016లో జయలలిత మరణం తర్వాత తలెత్తిన పరిణామాల్లో ఎఐఎడిఎంకె గుల్లబారిపోవడంతో ఇప్పుడు కొత్త పార్టీకి బోలెడంత చోటు దక్కుతుందనే భావన ఉంది. ఈ నేపథ్యంలోనే అభిమానులతో రజనీకాంత్ సమావేశాలు ఏర్పాటు చేశారు.
అభిమానులతో తాజాగా రజనీ ఏర్పాటు చేసిన సమావేశం రెండోది. ఈ సమావేశం ముగింపులోనే తన రాజకీయ వైఖరి చెబుతానని రజనీ వెల్లడించారు. ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడంలేదు. వచ్చే విషయమై రాజకీయ వైఖరిని ఈ నెల 31న ప్రకటిస్తా’ అని మంగళవారం చెప్పారు. రాజకీయాల్లో విజయవంతం కావడానికి కేవలం సామర్ధ్యం, ధైర్యం సరిపోవని, తగిన వ్యూహం, రాజకీయ వాతావరణం ఉండాలని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘యుద్ధం వచ్చినప్పుడు ఎదుర్కొందాం’ అంటూ గతంలోనే పిలుపునిచ్చిన రజనీ, ‘యుద్ధం అంటే ఎన్నికలు. అవి ఇప్పుడు వచ్చాయా’ అని తాజాగా ప్రశ్నించారు.
మరోవైపు జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకె వారసత్వ పోరులో పార్టీ అధికారిక ఫ్యాక్షన్లను పక్కకు నెట్టి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అనూహ్యంగా ముందుకొచ్చారు. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్.కె. నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో దినకరన్ విజయం సాధించడం మరో మలుపు. దీంతో… అన్నాడిఎంకె శ్రేణులు శశికళ గూటికి చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఈపీఎస్, ఓపీఎస్ టీమ్ ఎక్కువ కాలం నిలబడే అవకాశాలు లేవు. ఆ స్థానంలో అన్నాడిఎంకె వారసత్వాన్ని శశికళ వర్గం సొంతం చేసుకోగలుగుతుందా? అన్న విషయం తేలాల్సి ఉంది.
ఇంకోవైపు అధికార పార్టీ అస్తవ్యస్త స్థితినుంచి లబ్ది పొందాల్సిన ప్రతిపక్ష డిఎంకె వ్యూహాత్మక తప్పిదాలతో ఆర్.కె. నగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తమిళనాడు ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి రాగలమా… లేదా? అన్నదే తలైవాను వేధిస్తున్న ప్రశ్న. ‘నేనెప్పటికీ మీ సేవకుడినే’ అని ‘ముత్తు’ ఎప్పుడో ముక్తాయించినా… ఆచరణలో ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. తాను రాజకీయాలకు కొత్తేమీ కాదంటూనే.. ఆలస్యం చేశానన్న విషయాన్ని తాజాగా ఒప్పుకున్నాడు. కొత్త సంవత్సరంలోనైనా అభిమానులకు తీపి కబురు చెబుతాడో లేదో వేచి చూడాలి.