రజనీ 2.o ! కొత్త పార్టీ పెడతానని ప్రకటన… ప్రసంగ పాఠం ఇదే

1 0
Read Time:10 Minute, 34 Second

2017 సంవత్సరానికి వీడ్కోలు పలికే వేళ పాత సంశయాలకు పాతరేసి… సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తమిళనాడులోని 234 అసెంబ్లీ సీట్లకూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు. గత ఆరు రోజులుగా చెన్నైలో అభిమాన సంఘాల నేతలతో సమావేశమైన రజనీ, మొదటి రోజు చెప్పినట్టుగానే చివరి రోజు (ఆదివారం) ప్రకటన చేశారు. దీంతో అభిమానుల రెండు దశాబ్దాల నిరీక్షణకు, గత ఏడాది కాలంగా తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న చర్చకు తెర పడింది.

రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభిమానుల సమావేశంలో తలైవర్ మాట్లాడుతూ…గత సంవత్సర కాలంగా తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు ప్రజలు సిగ్గుతో తల దించుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తనకు ఈ ఉన్నత స్థితిని కల్పించిన ప్రజలకోసం ఇప్పటికైనా రాజకీయ నిర్ణయం తీసుకోకపోతే జీవిత కాలం బాధపడవలసి వస్తుందని పేర్కొన్నారు. రాజకీయాలను, వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందనన్న రజనీకాంత్.. తనకు కార్యకర్తలకంటే ప్రక్షాళన చేసేవారు కావాలని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి రావడానికి తాను భయపడలేదని, కానీ మీడియా అంటే తనకు భయమని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. మీడియాను ఎదుర్కొనేప్పుడు పెద్ద పెద్దవాళ్లే వణికిపోతారని, ఇప్పటికీ చిన్నవాడినైన తనకు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని పేర్కొన్నారు. చో రామస్వామి మీడియా విషయమై తనను హెచ్చరించారని, ఆయన ఇప్పుడు బతికి ఉంటే తనకు 10 ఏనుగుల బలం ఫీలయ్యేవాడినని రజనీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక భావజాలమున్న రజనీకాంత్.. తాను నమ్మే బాబా యోగముద్రను చూపిస్తూ రాజకీయ ప్రకటన చేశారు.

‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అంటూ శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చేసిన హితబోధను గుర్తు చేసిన రజనీకాంత్ ‘నీ పని నీవు చేయి. మిగిలిన విషయాలు నేను చూసుకుంటా. యుద్ధానికి వెళ్ళు. నువ్వు విజయుడివైతే పాలన చేస్తావు. మరణిస్తే…వీరుడిగా నిలిచిపోతావు. యుద్ధానికి వెళ్లకపోతే పిరికివాడిగా నిలిచిపోతావు’ అనే వచనాలను అభిమానుల ముందు వల్లించారు.

తానిప్పుడు యుద్ధం చేయడానికి సర్వసన్నద్ధుడినయ్యానని ప్రకటించిన రజనీకాంత్ ‘ఇక బాణం సంథించడమే మిగిలింది’ అన్నారు. తన రాజకీయ ప్రవేశం తప్పనిసరి అని, ఇది ప్రస్తుతం కాలపు అనివార్యత అని రజనీ వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 234 సీట్లకూ పోటీ పెడతానని, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం లేనందున పోటీ చేయబోమని, పార్లమెంటు ఎన్నికల విషయం ఆ సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తానని రజనీ చెప్పారు.

నేను రాజకీయాల్లోకి డబ్బు, కీర్తికోసం రావడంలేదని, తన కలలకు మించి వెయ్యి రెట్లు వాటిని అభిమానులు అందించారని రజనీ పేర్కొన్నారు. రాజకీయ పదవి కావాలనుకుంటే 1996లోనే తాను తీసుకోగలిగేవాడినని, కానీ ఆ పని చేయలేదని చెప్పారు. 45 ఏళ్ళ వయసులో కోరుకోనివాడిని 65 సంవత్సరాల వయసులో కాంక్షిస్తానని అనుకుంటున్నారా? అని అభిమానులను ప్రశ్నించారు.

రజనీకాంత్ ప్రసంగంలో మిగిలిన అంశాలు

రాజకీయ అధికారంకోసం కాకపోతే మరి ఎందుకు? రాజకీయాలు కుళ్లిపోయాయి. ప్రజాస్వామ్యం పుచ్చిపోయింది. గత ఏడాదిగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సిగ్గుతో తల వంచుకునేలా చేశాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఈ సమయంలో నేను నిర్ణయాత్మక చర్య తీసుకోకుంటే..నాకు జీవితాన్నిచ్చిన ప్రజలకోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంతో కొంత మంచి చేయకుంటే… ఆ అపరాధం నా మరణం వరకు వెన్నాడుతుంది’’

రాజకీయ మార్పునకు సమయం ఆసన్నమైంది. వ్యవస్థను మార్చాలి. మనకు నిజాయితీ, నిజం, నియమాలు, పారదర్శకత మేళవించిన రాజకీయాలు కావాలి. ఆధ్యాత్మిక రాజకీయాలు కావాలి. కులం, మతం ఆధారిత రాజకీయాలు కావు. అదే నా ధ్యేయం. నా కోరిక. నా లక్ష్యం. అది నేనొక్కడినే చేయలేను. తమిళ ప్రజలంతా ఒక్కటై నాకు మద్ధతు ఇవ్వాలి’’

ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అంత తేలిక కాదని నాకూ తెలుసు. అది ముత్యాలకోసం లోతైన సముద్రంలోకి దూకడం లాంటిది. దేవుడి దయ, ప్రజల ప్రేమ, నమ్మకం, గౌరవం, మద్ధతు ఉంటేనే సాధించగలం. దేవుడి దయ, ప్రజల మద్ధతు పొందగలమనే పూర్తి విశ్వాసం నాకు ఉంది’’

పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లి విజయం సాధించినప్పుడు… శత్రువు ఖజానాను కొల్లగొట్టేవారు. కమాండర్లు, సైనికులు ప్రజలను దోచుకునేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయ నాయకుల చేతుల్లో ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రజలను వివిధ మార్గాల్లో మోసం చేస్తున్నారు. రాజులు విదేశాలను దోచుకుంటే.. మన రాజకీయులు సొంత దేశాన్ని దోచుకుంటున్నారు. ఇది మారాలి. ప్రజాస్వామ్య పద్ధతిలోనే దాన్ని మార్చాలి’’

ఏ పార్టీలోనైనా పార్టీ కార్యకర్త చాలా ముఖ్యం. పార్టీ కార్యకర్తే ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా సిఎం కూడా కావచ్చు. కానీ, నేను పార్టీ కార్యకర్తలను కోరుకోవడంలేదు. నేను రక్షకులను కోరుకుంటున్నాను. మనం అధికారంలోకి వస్తే.. ప్రజలకు దక్కవలసినవాటిని కచ్చితంగా దక్కేలా చూసే రక్షకులు కావాలి. స్వార్ధంతో ఎమ్మెల్యే, ఎంపీ లేదా అధికారుల పదవులకు వెళ్లని రక్షకులు కావాలి. అధికారంలోకి వచ్చాక పార్టీ వర్కర్లు, నాయకులు, అధికారులను జవాబుదారులను చేసే రక్షకులు కావాలి’’

నేను ఈ రక్షకులను నియంత్రించే ప్రజా ప్రతినిధిగా ఉంటాను. సరైన సమయంలో సరైన స్థానానికి సరైన వ్యక్తిని ఎంపిక చేసే ప్రజా ప్రతినిధిగా నేనుంటాను. మనం ఈ పని చేయడానికి ఒక సైన్యం లేదా రక్షక దళం కావాలి. దాన్ని మనం సృష్టించాలి. నాకు వేల సంఖ్యలో అభిమాన సంఘాలున్నాయి. రిజిస్టర్ అయినవాటికి రెట్టింపు సంఖ్యలో కానివి ఉన్నాయి. రిజిస్టర్ కాని అభిమాన సంఘాలను రిజిస్టర్ చేయవలసిన అవసరం ఉంది. వాటన్నిటినీ సమైక్యపరచడం మన మొదటి విధి’’

ఇది సినిమా కాదు. రాజకీయాలు. ఇతరులనూ మనం తోడు చేసుకోవాలి. యువకులు, మహిళలు, పిల్లలను కూడా. రాష్ట్రంలోని ప్రతి మూలా మన క్లబ్ ఉండాలి. ఇది మన మొదటి టాస్క్. అనంతరం మనం క్రమశిక్షణ, మర్యాదలతో ప్రజాస్వామ్య సవాలుకు సిద్ధపడాలి. అప్పటిదాకా మనం రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ నియమం నాకూ వర్తిస్తుంది. అప్పటిదాకా ఇతర రాజకీయ నాయకులను, పార్టీలను విమర్శించొద్దు. రాజకీయ కార్యాచరణలోకి వెళ్లొద్దు. దానికి ఇతరులు ఉన్నారు’’

రాజకీయ సరస్సులో ఇప్పటికే కొందరున్నారు. వాళ్ళు ఈదాలి లేదంటే మునిగిపోతారు. మనకు ఎలా ఈదాలో తెలుసు. కానీ, మనం భూమిమీద ఈదకూడదు. మనం సరస్సులోకి దిగినప్పుడే ఈదుతాం. మనం మన సైన్యాన్ని సిద్ధం చేద్దాం. రాష్ట్ర ఎన్నికలకు ముందు పార్టీని ప్రారంభిస్తాం. మన కార్యాచరణ ప్రణాళికను ప్రజలకు చెబుతాం. మనం ఏం చేయగలమో..ఏం చేయలేమో చెబుతాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే మూడేళ్లలోపే రాజీనామా చేస్తాం’’

నిజం, కష్టం, ప్రగతి మన నినాదం. మంచి ఆలోచన… మంచిగా మాట్లాడటం.. మంచి చేయడం… ఇదే నా సూత్రం. మన సైన్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుంది. తమిళనాడు వర్ధిల్లాలి. తమిళ ప్రజలు పురోగమించాలి. జైహింద్’’

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply