యుద్ధ భూమిలో బాంబులు పేలుతుంటే ఎవరైనా తాపీగా వాటి ప్రక్కనే నడుచుకుంటూ వస్తారా? మంగళవారం రష్యాలో ఓ సూపర్ మహిళ ఆ పని చేసింది! అయితే అది నిజంగా యుద్ధభూమి కాదు. పేలుళ్ళను సైతం తట్టుకునేలా రూపొందించిన వస్త్రాలను పరీక్షించడంకోసం సృష్టించిన యుద్ధ సన్నివేశం. పెద్ద శబ్దంతో బాంబులు పేలుతున్నా… మంటలు చుట్టుముట్టినా ఆ మహిళకు ఏం కాలేదు. ఆమె కూడా ఏమాత్రం తొణక కుండా పేలుళ్ళు, మంటల మధ్యనుంచి తాపీగా నడుచుకుంటూ రావడం విశేషం.
ఇంతకూ ఆమె ఎవరంటారా? యుద్ధంలో పాల్గొనే సైనికురాలు మాత్రం కాదు. రష్యన్ మోడల్ విక్టోరియా కొలెస్నికోవా. తలనుంచి కాలి మునివేళ్లదాకా అత్యాధునిక సూట్ ధరించి పేలుళ్ళ మధ్య నడిచిన ఆమెకు ముఖంపై కొద్దిగా మసి మాత్రమే అంటింది. విక్టోరియా బాంబుల మధ్య నడుచుకుంటూ వస్తుంటే ఉత్కంఠతో చూసిన జర్నలిస్టులతో ఆమె ఏమన్నారంటే.. ‘ఫైర్ రేంజ్ మధ్య నిల్చోవడం ఒక అమోఘమైన ఫీలింగ్’.
కొలెస్నికోవా వృత్తిపరంగా స్టంట్స్ ఉమన్ కూడా. అయితే, మంగళవారం ఆమెచేసింది… రోజువారీ రొటీన్ కు ఏమాత్రం సంబంధంలేని అరుదైన ప్రమాదకరమైన స్టంట్. ఆ సూట్లను రూపొందిస్తున్న కంపెనీ ప్రతినిధి సెర్గీ కిటోవ్ మాట్లాడుతూ.. తమ సామాగ్రి పేలుళ్ళను, మంటలనూ తట్టుకుంటాయని చెప్పారు. ప్రస్తుతం 15 సెకండ్లపాటు మంటలు కొనసాగినా తట్టుకునే సామర్ధ్యం ఉందని, దాన్ని 30 సెకండ్లకు పెంచి 2020నాటికి మిలిటరీకి అందిస్తామని పేర్కొన్నారు.