పుతిన్ ప్రయాణ మార్గంలో పేలుస్తామని టెలిఫోన్ కాల్స్
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 బాంబు బెదిరింపులు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక్క రోజులో ఎదుర్కొన్న బెదిరింపులివి. శుక్రవారం సెయింట్ పీటర్స్ బర్గ్ లో పుతిన్ వాహన శ్రేణి వెళ్ళే దారిలో బాంబులు అమర్చామని, ఆయన వెళ్లేప్పుడు పేల్చేస్తామని బెదిరిస్తూ ఆ ఒక్క రోజులోనే 50 ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే, అవన్నీ ఉత్తివేనని తేలింది.
శుక్రవారం ఉదయం పుతిన్ పర్యటనకు సంబంధించి 60 కాల్స్ వస్తే అందులో 50 బాంబు బెదిరింపులేనట. రష్యాలో ఇప్పుడీ ఉదంతాన్ని ‘టెలిఫోన్ టెర్రరిజం’గా వ్యవహరిస్తున్నారు. ‘టెలిఫోన్ టెర్రరిస్టు’లు ప్రాంక్ కాల్స్ చేసినట్టు రష్యన్ అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. పుతిన్ ప్రయాణ మార్గంతో పాటు ఆయన సందర్శించే అవకాశం ఉన్న ప్రదేశాల్లో కూాడా బాంబులు పెట్టినట్టు కాల్స్ చేసినవారు చెప్పారు.
ఇప్పుడీ ‘టెలిఫోన్ టెర్రిరిస్టు’లను కనిపెట్టే పనిలో రష్యా పోలీసులున్నారు. అయితే, వీరు విదేశాల్లో ఉన్నవారు కావచ్చని ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చారు.