రాక్షస ’రాజ్య’స్థాన్… కూలీని కిరాతకంగా చంపి ‘లవ్ జిహాదీ’ ట్యాగ్

2 0
Read Time:4 Minute, 7 Second

వీడియో తీయించి తాపీగా విడుదల చేసిన మతోన్మాది

అతనో కూలీ..పొట్ట చేతపట్టుకొని పశ్చిమ బెంగాల్ నుంచి రాజస్థాన్ కు వలస వెళ్లాడు. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. అతను చేసిన పాపమేమిటంటే ముస్లిం కావడమే…! మత మౌఢ్యం పెరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో తిరుగాడటమే…!! మతోన్మాదం తలకెక్కిన ఓ కిరాతకుడు ఈ కూలీని అత్యంత దుర్మార్గంగా హతమార్చి ‘లవ్ జీహాదీ’ ట్యాగ్ తగిలించాడు. ఈ హత్యను మరొక ఉన్మాది వీడియోలో చిత్రీకరించగా స్వయంగా ఇంటర్నెట్ లో ప్రచారానికి పెట్టారు. ముస్లిం వ్యతిరేక ఉన్మాదాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా పథకం ప్రకారం హత్యను చిత్రీకరించిన ఈ ఉన్మాది చర్య దేశం మొత్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.

హత్యకు గురైన వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దాకు చెందిన కూలీ మహ్మద్ ఇఫ్రాజుల్. హత్య చేసిన వ్యక్తి శంభూలాల్. హత్య జరిగింది రాజస్థాన్ లోని రాజ్ సమంద్ లో… ఇది గత హత్యలకు భిన్నమైనది. అంతకంటే క్రూరమైనది. బాధితుడిని నమ్మించి నిందితుడు ఆరుబయటకు తీసుకెళ్లి వెనుకనుంచి గొడ్డలితో నరికాడు. బాధతో ఇఫ్రాజుల్ కేకలు వేస్తూ వేడుకుంటున్నా రాక్షస క్రీడ ఆగలేదు. హంతకుడు శవాన్ని కూడా వదలకుండా నరికిన విద్వేష దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

హత్య అనంతరం తాపీగా ఆ శవానికి నిప్పంటించాడు. ఈ ఉన్మాదం మొత్తాన్ని హంతకుడి మరో ఉన్నాద స్నేహితుడు ఫోన్లో చిత్రీకరించాడు. హత్య అనంతరం హంతకుడు… లవ్ జీహాద్ నుంచి ఒక హిందూ మహిళను కాపాడే లక్ష్యంతో ఈ హత్య చేసినట్టు చెప్పడం ఆ వీడియోలో నమోదైంది. ఇలాగే ఒక్కొక్కరినీ పట్టుకొని చంపుతానంటూ హంతుకుడు రంకెలు వేయడమూ వీడియోలో నిక్షిప్తమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. పోలీసులు కాలిపోయిన ఇఫ్రాజుల్ దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉన్మాద చర్యను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా ఖండనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం విస్తరిస్తున్న మత విద్వేషానికి ఈ దుర్మార్గం నిలువెత్తు ఉదాహరణ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చట్టం, శాంతిభద్రతలు లేవనే విమర్శలూ సోషల్ మీడియాలో కోకొల్లలుగా వస్తున్నాయి. ఇప్పుడొక కొత్త కథ తెరపైకి తెస్తున్నారు. హంతకుడికి మతిస్తిమితం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారట! పథకం ప్రకారం విద్వేష హత్యకు పాల్పడినట్టు ఆ వీడియోతోనే స్పష్టమవుతోంది.

ఈ విద్వేషానికి కొలమానం ఉందా?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply