రాహుల్ – యాదవ్ లేట్ లంచ్ భేటీ 

0 0
Read Time:3 Minute, 12 Second

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కొద్దిగా తీరిక చేసుకొని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తో లంచ్ చేయడానికి బయటకు వెళ్ళారు. వారిద్దరూ ఢిల్లీలోని ఓ హోటల్ కు వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ లంచ్ భేటీ సుమారు గంటన్నర పాటు సాగినట్టు తేజస్వి యాదవ్ సన్నిహితులు చెప్పారు.

రాహుల్ – యాదవ్ ద్వయం మధ్య తాజా రాజకీయ పరిణామాలు అనేకం చర్చకు వచ్చాయని సమాచారం. బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్జేడీ కొద్ది నెలల క్రితం వరకు  మహా కూటమిలో భాగంగా జనతా దళ్ యునైటెడ్ పార్టీతో కలిసి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. మహా కూటమికి చెయ్యిచ్చిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. అక్కడ బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య మాత్రం స్నేహం కొనసాగుతోంది.

అయితే, జూలైలో నితీశ్ విడిపోయిన తర్వాత తేజస్వి యాదవ్ ఆగస్టులో ఓ భారీ సభను నిర్వహించారు. అప్పట్లో ఆ సభకు రాహుల్ గాంధీ హాజరు కాలేదు. విదేశాలకు వెళ్లే పని ఉన్నందున రాహుల్ బీహార్ సభకు వెళ్ళలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. తేజస్వి యాదవ్ తో మాత్రం రాహుల్ గాంధీ టచ్ లోనే ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెల తొమ్మిదో తేదీన యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు కూడా.

ఇదిలా ఉంటే.. బీహార్ లో మహా కూటమి చీలిపోయాక లాలూ కుటుంబంపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ విచారణలు వేగం పుంజుకున్నాయి. ఆ విచారణకు హాజరు కావడం కోసం తేజస్వి గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన రాహుల్ గాంధీని కలవాలని భావించినట్టు చెబుతున్నారు. శుక్రవారం రాహుల్ గాంధీతో లంచ్ భేటీ అనంతరం తేజస్వి తమ ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తనను లంచ్ కు తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించినందుకు రాహుల్ గాంధీకి యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply