నాలుగున్నరేళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా పని చేసిన రాహుల్ గాంధీ తల్లి తర్వాత అధ్యక్ష పదవిని స్వీకరించడానికి సన్నద్ధమవుతున్నారు. యువరాజ స్థానంనుంచి రాజుగా సర్వాధికారాలు చేజిక్కుంచుకోబోతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (జిడబ్ల్యుసి) రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. సోమవారం ఢిల్లీలో సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన జిడబ్ల్యుసి, అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలును ఖరారు చేసింది.
డిసెంబర్ 1న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. నాలుగో తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. తర్వాత రోజు నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి రంగంలో ఉన్న అభ్యర్ధుల పేర్లను మధ్యాహ్నం 3.30 కల్లా ప్రకటిస్తారు. ఒకవేళ ఒకటికంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే.. ఉపసంహరించుకునేందుకు 11వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలవరకు అవకాశం ఉంటుంంది. తుది జాబితాను అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు ప్రకటిస్తారు. పోలింగ్ అనివార్యమైతే డిసెంబర్ 16వ తేదీన ఆ ప్రక్రియను చేపడతారు. పోలింగ్ జరిగితే కౌంటింగ్ 19వ తేదీన ఉంటుంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదే ఖాయమైతే గుజరాత్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యేనాటికే రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ నాలుగో తేదీతో ముగియనుండగా.. గుజరాత్ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో డిసెంబర్ 9, 14 తేదీల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 18వ తేదీన జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రాహుల్ మినహా మరెవరూ నామినేషన్ దాఖలు చేయని పక్షంలో ఐదో తేదీనే నాలుగో తేదీనే ఫలితం తేలుతుంది. అప్పుడు రాహుల్… పార్టీ అధ్యక్షుడి హోదాలోనే గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. అంటే… పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ ఎదుర్కోబోయే తొలి సవాల్ గుజరాత్ ఎన్నికలే!