రాయలసీమలోని కరువు పీడిత జిల్లా అనంతపురంలో పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దక్షిణ కొరియా అధికారులు, పరిశ్రమలతో జరుపుతున్న చర్చలు ఫలిస్తున్నాయి. అనంతపురంలో రూ.4000 కోట్ల పెట్టుబడులతో 37 కొరియా కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటి ద్వారా 7 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసే కొరియన్ సిటీలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ దేశంలోని పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్టు చెన్నైలోని దక్షిణ కొరియా కాన్సూల్ జనరల్ కిమ్ హ్యూంగ్ టే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు.
టే శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక వృద్ధిరేటు, స్నేహపూర్వక వాతావరణం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వంటి అంశాలు తమను ఏపీ వైపు ఆకర్షించేలా చేశాయని కిమ్ టే ఈ సందర్భంగా చెప్పారు. ఏపీతో ఆర్ధిక సంబంధాలే కాకుండా సాంస్కృతిక, సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని తమదేశం భావిస్తోందని తెలిపారు. ఏపీ నుంచి కొరియాకు మిర్చి, పొగాకు, టెక్స్‌టైల్స్, చీరలు ఎగుమతులు జరిగేలా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేయ తలపెట్టిన ‘కొరియన్ సిటీ’ అంశంపైనా ఇరువురు చర్చించారు. విజ్ఞాన సముపార్జనలో భాగంగా ఇరుప్రాంతాల విద్యార్ధుల పరస్పర మార్పిడికి ఒక ప్రణాళిక రూపొందించాల్సి వుందని అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ‘కొరియన్ సిటీ’ నిర్మాణానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల వాతావరణం సృష్టించామన్న ముఖ్యమంత్రి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణం పరిష్కరిస్తామని చెప్పారు. దక్షిణ కొరియా నుంచి తరలివచ్చే కంపెనీల కోసం ఏపీఈడీబీ, ఇంకా తమ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి వచ్చే కంపెనీల్లో అత్యధికం ఆటోమొబైల్ రంగానికి సంబంధించినవని, వాటి పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చే ఏడాది మార్చికల్లా కార్యరూపం దాలుస్తాయని అధికారులు తెలిపారు.
కొరియా లాంగ్వేజ్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని కిమ్ టే ముఖ్యమంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ యువతను ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియాకు చెందిన కోచ్‌లతో శిక్షణ అందిస్తామని అన్నారు. సమావేశంలో దక్షిణకొరియా డిప్యూటీ కాన్సూల్ జనరల్ డేసూ చాంగ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ పాల్గొన్నారు.