రూ. 52,00,000 లక్షల కోట్లు… సౌదీ స్వాధీనం చేసుకునే ఆస్తుల విలువ

800 బిలియన్ అమెరికన్ డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు)… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)కి దాదాపు తొమ్మిది రెట్లు.. సౌదీ అరేబియా ప్రభుత్వం ‘అవినీతిపై యుద్ధం’లో భాగంగా స్వాధీనం చేసుకోబోతున్న డబ్బు, ఆస్తుల విలువ ఇంత ఉంటుదట! ఇప్పటికే రాజకుటుంబంలోని పలువురు యువరాజులు, మంత్రులను రాజు ఆదేశాలతో అరెస్టు చేశారు. వారి వద్ద రెండు నుంచి మూడు ట్రిలియన్ రియాల్స్ ధనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా పేర్కొంది.

సౌదీ ప్రభుత్వం 11 మంది యువరాజులు, నలుగురు మంత్రులను అరెస్టు చేసినట్టు శనివారం వార్తలు వచ్చాయి. అరెస్టయినవారిలో నేషనల్ గార్డ్, ఆర్థిక శాఖ మంత్రులూ ఉన్నారు. రాజరికంలో పేరుకుపోయిన అవినీతిపై యుద్ధంలో భాగంగానే ఈ అరెస్టులు జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఛైర్మన్ గా ఏర్పాటైన కొత్త కమిటీ ఒకటి అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించింది.

కింగ్ సల్మాన్ జారీ చేసిన రాయల్ డిక్రీతో ఈ కమిటీ ఏర్పాటైంది. విధి నిర్వహణలో చట్టాలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులనుంచి ఈ కమిటీకి మినహాయింపులు ఇచ్చారు. నేరాలను గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టబడినవారికి శిక్ష వేసేందుకు కూడా ఈ కమిటీకి అధికారం దఖలు పడింది. ఆ అధికారాల్లో ఆస్తుల స్వాధీనం, ప్రయాణాలపై నిషేధం విధించడం, అరెస్టులు చేయడం ఉన్నాయి.

ఈ కమిటీ ఆదేశాలను అనుసరించి రాజ ప్రముఖుల అరెస్టు తర్వాత కొందరు వ్యాపారవేత్తలను కూడా అరెస్టు చేశారు. మొత్తంగా 60 మందికి పైగా ఉన్నత స్థాయి వ్యక్తులు జైళ్ళకు వెళ్ళారు. వారిలో చాలా మది బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశారు. కాగా సీజ్ చేసిన ఆస్తుల్లో ఎక్కువ భాగం విదేశాల్లో ఉన్నట్టుగా చెబుతున్నారు. అవినీతి ద్వారా పోగుపడిన సంపదన మొత్తం ఇక ప్రభుత్వానికి చెందుదుందని యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కమిటీ సభ్యులు చెబుతున్నారు.

Related posts

Leave a Comment