రెండంకెల రంకె… జూలై-సెప్టెంబర్ వృద్ధి రేటు 11.04 శాతం

8 0

వివిధ రంగాలు జోడించిన స్థూల విలువ రూ. 1,27,484 కోట్లు

తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 11.72 శాతం 

రెండో క్వార్టర్లో మందగించిన పారిశ్రామిక వృద్ధి

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండంకెలకు తగ్గడంలేదు. 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ (జూలై-సెప్టెంబర్)లో అన్ని రంగాలు కలిపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జోడించిన స్థూల విలువ (జీవీఎ) రూ. 1,27,484 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.04 శాతం వృద్ధి నమోదైంది. అయితే, వృద్ధి రేటు మొదటి త్రైమాసికం కంటే తగ్గింది. అప్పుడు (ఏప్రిల్-జూన్ ) వృద్ధి రేటు 11.72 శాతంగా నమోదైంది. జీవీఏ మొత్తం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 1,19,652 కోట్లుగా ఉంది. రెండో త్రైమాసికం వృద్ధి రేటు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారంనాడిక్కడ వెల్లడించారు.

అర్ధ సంవత్సరం మొత్తానికి చూసినప్పుడు అన్ని రంగాలకూ కలిపి జీవీఏ వృద్ధి రేటు 11.37 శాతంగా ఉంది. అదే కాలానికి జాతీయ స్థాయిలో జీవీఏ వృద్ధి కేవలం 5.8 శాతంగా నమోదైంది. అర్ధ సంవత్సరం మొత్తానికి తీసుకుంటే జీవీఏ వ్యవసాయ రంగంలో 25.60 శాతం, పారిశ్రామిక రంగంలో 7.43 శాతం, సేవల రంగంలో 8.38 శాతం మేరకు వృద్ధి చెందాయి.

జాతీయ స్థాయిలో జీవీఏ వృద్ధి రేటు రెండో త్రైమాసికంలో కేవలం 6.1 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ అందుకు దాదాపు రెట్టింపు స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. అయితే, తొలి త్రైమాసికం కంటే జాతీయ స్థాయిలో వృద్ధి రేటు పెరిగితే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తగ్గింది. దీనికి ప్రధాన కారణం పారిశ్రామిక రంగంలో జీవీఏ కేవలం 6.8 శాతం పెరగడమే. వ్యవసాయ రంగం జీవీఏ 24.05 శాతం, సేవల రంగం జీవీఏ 8.10 శాతం పెరిగాయి.

పారిశ్రామిక రంగంలో కూడా నిర్మాణ ఉపరంగం మరీ మందగించింది. ఈ రంగంలో జీవీఏ వృద్ధి రేటు కేవలం 5.28 శాతంగా నమోదైంది. దాని తర్వాత విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా విభాగాలు 6.65 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. తయారీ రంగం 7.89 శాతం వృద్ధితో పర్వాలేదనిపించింది. ఇక సేవల రంగంలోని ఉప రంగాలను తీసుకుంటే..రైల్వేలకు సంబంధించి అత్యల్ప జీవీఏ వృద్ధి (1.84 శాతం) నమోదైంది. పాలనా రంగం వృద్ధి రేటు కూడా మందంగానే ఉంది.

స్థూలంగా వ్యవసాయ రంగపు జీవీఏ వృద్ధి మరోసారి గణనీయంగానే (24 శాతం) నమోదైంది. ఇది తొలి త్రైమాసికంలో 27.6 శాతంగా ఉంది. అందులో ప్రధానంగా ఫిషరీస్ వాటా అధికం. రెండో త్రైమాసికంలో ఫిషింగ్ వృద్ధి మరింత పెరగడంతోపాటు వ్యవసాయ, ఉద్యాన ఉప రంగాల్లో కూడా జీవీఏ గణనీయంగానే పెరిగింది.

Leave a Reply