రేవంత్ రెడ్డికి బాధ్యతలనుంచి ఉధ్వాసన

శాసనసభా పక్ష నేతగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించొద్దని పార్టీ ఆదేశం..
శాసనసభా సమావేశాలపై చర్చకోసం టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమావేశం.. 
రేవంత్ కేవలం ఎమ్మెల్యేగా హాజరు కావాలని రమణ ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు రేవంత్ రెడ్డిని ఆయా బాధ్యతలనుంచి తప్పించారు. రేవంత్ ఆ రెండు హోదాల్లో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టవద్దని పార్టీ ఆదేశించింది. ఈమేరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ గురువారం ప్రకటన చేశారు. రేవంత్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ శరవేగంగా స్పందిస్తున్నట్టు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

రేవంత్ రెడ్డిపై చర్యలుంటాయని మంగళవారమే రమణ సంకేతాలిచ్చారు.. బుధవారమే.. బాధ్యతలనుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు, దానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపినట్టు రమణ ప్రకటించారు. తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశాన్ని రేవంత్ నిర్వహించకూడదని విలేకరులతో మాట్లాడిన సందర్భంగా రమణ స్పష్టం చేశారు. 27వ తేదీనుంచి జరగనున్న తెలంగాణ శాసనసభ సమావేశాలకోసం తాము బీజేేపీతో కలసి ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపిన రమణ ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఈ సమావేశానికి రేవంత్ ను కూడా ఆహ్వానించారు.

రమణ గురువారం ఈ విషయమై రెండు పత్రికా ప్రకటనలు జారీ చేశారు.  ’తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షులవారికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యవహారంపై  తుది నివేదిక ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలోనూ, తెలంగాణ శాసనసభాపక్ష నేతగానూ కొనసాగితే తీవ్ర నష్టం జరుగుతుంది. కనుక చర్యలు చేపట్టాలని జాతీయ అధ్యక్షులవారిని కోరాం. రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, టీ. టీడీఎల్పీనేతగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టవద్దని సూచించడం జరిగింది’ అని మొదటి ప్రకటనలో పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు రేపు (గురువారం) మధ్యాహ్నం 1 గంటకు గోల్కొండ హోటల్ లో టీడీపీ, బీజేపీ నేతల సమావేశం ఏర్పాటు చేశామని, మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని రమణ తెలిపారు.

’గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జాతీయ పార్టీ అధ్యక్షులవారికి వివరించాం. రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, టీడీఎల్పీ నాయకుడిగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టవద్దన్ననిర్ణయాన్ని జాతీయ అధ్యక్షులవారు ఆమోదించారు. మధ్యాహ్నం 12 గంటలకు లండన్ నుంచి జాతీయ అధ్యక్షులవారు నాకు ఫోన్ చేశారు. పార్టీ శ్రేయస్సు రీత్యా పార్టీ లైన్ లోప్రతి ఒక్కరూ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేపు టీడీపీ, బీజేపీ సమావేశానికి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది’ అని రమణ తన రెండో ప్రకటనలో పేర్కొన్నారు.

 

Related posts

Leave a Comment