రేవంత్ వర్సెస్ మోత్కుపల్లి

  • హాట్ హాట్ గా టీటీడీపీ సమావేశం..
  • రాహుల్ గాంధీని కలవడంపై రేవంత్ మౌనం..
  • ప్రశ్నల వర్షం కురిపించిన మోత్కుపల్లి..
  • ఎదురు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశం వాడి వేడిగా జరిగింది. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలసి వచ్చిన నేపథ్యంలో… ఈ అంశంపై సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మండిపడ్డడారు. రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి ఒకటి రెండు సందర్భాల్లో స్పందించి ఎదురు ప్రశ్నలు వేసిన రేవంత్ రెడ్డి, మిగిలిన అంశాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత ఆయనతోనే చర్చిస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆక్షేపణ తెలిపిన మోత్కుపల్లి సమావేశం ముగియక ముందే అక్కడినుంచి వెళ్ళిపోయారు.

రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలిశారని,కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నరసింహులు, సీతక్క, రావుల చంద్రశేఖరరెడ్డి, సీనియర్ నేతలు ఉమామాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నామ నాగేశ్వరరావు, జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎజెండానుంచి ప్రక్కకు మళ్ళారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వచ్చిన వార్తలను ప్రస్తావించిన మోత్కుపల్లి… ’మీరు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిశారా? కలిస్తే ఎందుకు? పార్టీ జాతీయ అద్యక్షుడి అనుమతి లేకుండా ఏ హోదాలో రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు?  పొత్తుల విషయం చర్చించడానికే అయితే… పార్టీ జాతీయ అధ్యక్షుడి అనుమతి అక్కర్లేదా? మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది నిజమేనా? లేకపోతే మీడియాలో వచ్చిన వార్తలను ఎందుకు ఖండించలేదు? ఆంధ్రప్రదేశ్ మంత్రులపై ఆరోపణలు చేయడం ఏమిటి? ఒకవేళ పార్టీ మారడం నిజమైతే ఈ సమావేశానికి ఎందుకొచ్చారు?’ అని వరుస ప్రశ్నలను సంధించారు.

దీనికి ధీటుగా స్పందించిన రేవంత్ ఢిల్లీలో ఏం జరిగిందో తనకు తప్ప ఎవరికీ తెలియదని, మీడియా రాసిన ప్రతిదానికీ తాను బాధ్యుడను కానని ఉద్ఘాటించారు. ’నేను పొత్తులపై చంద్రబాబు అనుమతి తీసుకోకుండా మాట్లాడానని విమర్శిస్తున్నారు. మీరు సార్ (చంద్రబాబు) అనుమతి తీసుకునే టీఆరెస్ తో పొత్తు పెట్టకుంటామని చెప్పారా?’ అని మోత్కుపల్లిని ప్రశ్నించారు.

దానికి మోత్కుపల్లి ప్రతిస్పందించారు. ’తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా.. ఆ పార్టీతో పొత్తుపై విలేకరులు అడిగినప్పుడు ఆ ప్రశ్నే రాదని, అవసరమైతే టీఆరెస్ లేదా బిజెపితో పొత్తు పెట్టుకుంటామని చెప్పాను. అంతే’ అని మోత్కుపల్లి వివరణ ఇచ్చారు. రేవంత్ మాత్రం మిగిలిన ఏ అంశాలపైనా పెదవి విప్పలేదు. చంద్రబాబు వద్దనే మాట్లాడతానని స్పష్టం చేశారు. ఓ దశలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకొని మోత్కుపల్లి తరహాలోనే ప్రశ్నించారు.

రేవంత్ వెళ్లడంతోపాటు తమను కూడా తీసుకెళ్తున్నట్టు కొందరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన అరవింద్ ’మా పేర్లు ఎందుకు లాగుతున్నారు’ అని ప్రశ్నించారు. ఏది ఏమైనా… రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన, మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వచ్చిన వార్తలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. తమ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకపోవడంతో మోత్కుపల్లి, అరవింద్, మరికొందరు సమావేశంనుంచి బయటకు వెళ్లిపోయారు. మిగిలిన సీనియర్ నేతలు కొనసాగారు. సమావేశం తర్వాత రేవంత్ విలేకరులతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు.

పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై మాట్లాడవలసిన టీటీడీపీ సమావేశం అర్ధంతరంగా వాయిదా పడింది. ఈ నెల 24వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

26న సమావేశం… రేవంత్ ఆహ్వానం

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న అంశంపైనే వాడి వేడిగా జరిగిన టీటీడీపీ సమావేశంలో కొసమెరుపు… ఈ నెల 26వ తేదీన టీడీఎల్పీ సమావేశానికి రావాలని అదే రేవంత్ రెడ్డి ఆహ్వానించడం. ఈ నెల 27వ తేదీనుంచి తెలంగాన శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఈ సమావేశానికి రావాలని ముఖ్య నేతలను రేవంత్ ఆహ్వానించారు. టీటీడీపీ సమావేశం తర్వాత రావుల, సీతక్క మీడియాకు ఈ విషయం చెప్పారు.

‘రేవంత్ మోసగాడు’

టీటీడీపీ సమావేశం వద్ద మాట్లాడకుండా మధ్యలోనే వెళ్లిపోయిన మోత్కుపల్లి… తర్వాత తన ఇంటివద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి మోసగాడని, బ్లాక్ మెయిలర్ అని మండిపడ్డారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తమందరినీ ప్రక్కన పెట్టి రేవంత్ రెడ్డిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీని మోసం చేశాడని మోత్కుపల్లి విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికకోసం రేవంత్ రెడ్డి చేసిన హడావిడి వల్లనే చంద్రబాబునాయుడు కేసును ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చిందని, పార్టీకి నష్టం జరిగిందని దుయ్యబట్టారు. రేవంత్ పుణ్యమా అని గతంలో 22 శాతంగా ఉన్న టీడీపీ ఓటింగ్ తెలంగాణలో ఏడు శాతానికి పడిపోయిందని ఆరోపించారు. అతను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ కూడా పాడవుతుందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు అరవింద్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ వెళ్ళిపోవడంవల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు.

Related posts

Leave a Comment