రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో భూసేవ ఒకటి. పౌరులకు ఆధార్ నెంబర్ తరహాలో ప్రతి భూమికీ ఓ యునీక్ ఐడెంటిటీ నెంబర్ కేటాయించే ‘భూధార్’ సహా సమాచార, లావాదేవీలకు సంబంధించిన అనేక సేవలను ఒకే గొడుగు కిందకు తేవడమే దీని లక్ష్యం. ‘భూసేవ’ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల్లో ఐటీ, ఐవోటీ, ఇ-ప్రగతి అమలు తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు భూసేవ, దాని పరిధిలోకి వచ్చే అంశాలపై పురోగతిని వివరించారు.
రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, పట్టణాల్లో 50 లక్షల భూములు, గ్రామాల్లో 85 లక్షల భూములు ‘భూసేవ’ పరిధిలోకి రానున్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు కూడా భాగం. వీటన్నిటికీ 11 అంకెల భూధార్ నెంబర్ ఇచ్చి జియోట్యాగింగ్ చేస్తారు. భూసేవ కోసం కొత్తగా ఎటువంటి సర్వే చేపట్టకుండా ప్రస్తుతం అందుబాటులో వున్న డిజిటలైజ్డ్, ఫీల్డ్ మ్యాప్ బుక్ (ఎఫ్ఎంబీ) వంటి సమాచారంతో రూపకల్పన జరుగుతుంది. భూవిస్తీర్ణం, పురసేవ – వెబ్‌ల్యాండ్‌లో నమోదైన యజమాని వివరాలు భూసేవలో పొందుపరుస్తారు.
2018 మార్చి కల్లా ‘భూసేవ’కు సంబంధించి మొత్తం 20 సేవల అనుసంధానం పూర్తవుతుందని, ఇప్పటికే 8 సేవలను అనుసంధానించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మునిసిపాలిటీలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘భూసేవ’ వచ్చే నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలిపారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ‘భూసేవ’ పూర్తిగా అమల్లోకి తెస్తామని చెప్పారు. భూ సేవ జియో రిఫరెన్స్ ద్వారా భూసార పరీక్షల వివరాలు, రైతులకు సలహాలు ఇచ్చేలా వుండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఇ-ప్రగతి ద్వారా ప్రతి శాఖను అనుసంధానించి ప్రజలకు రియల్ టైమ్‌లో సేవలు అందిచాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని అన్నారు. ప్రతి రోజు ఉదయాన్నే రియల్ టైమ్ గవర్నెన్స్‌పై గంటసేపు సమీక్షిస్తున్నానని చెప్పారు. ‘భూసేవ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సర్వేయర్లు, వీఆర్వోలకు ప్రత్యేక్ష శిక్షణ అందిస్తామని, రియల్ టైమ్ మానిటరింగ్ కోసం భూసేవ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి దానిని కోర్ డ్యాష్ బోర్డుకు అనుసంధానిస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు.
‘భూ సేవ’ ద్వారా అందించే సేవలు :
మీ భూదార్, భూ సమాచారం, మార్కెట్ విలువ, అనుమతించిన లే అవుట్ల సమాచారం, ఆస్తి పూర్వ చరిత్ర, అటవీ భూమి హక్కులు.
‘భూసేవ’ ద్వారా జరిపే లావాదేవీలు :
పంటపొలాలు, గ్రామీణ ఆస్తి, పట్టణ ఆస్తికి సంబంధించి మ్యుటేషన్, వ్యవసాయేతర భూమిగా మార్పు, భూవిభజన, సమస్యల పరిష్కారం.
భూసేవ ద్వారా చేపట్టే మార్పులుచేర్పులు :
పేరు సవరణ, మొబైల్ నెంబర్ చేర్చడం, మొబైల్ నెంబర్ మార్పు చేసుకోవడం.