వర్మకు మళ్లీ ఉధ్వాసన… ఈసారి ప్రధాని నేతృత్వంలోని కమిటీ నిర్ణయం

1 0
Read Time:7 Minute, 29 Second
సీబీఐ డైరెక్టర్ ను పునర్నియమించిన 48 గంటల్లోగా తొలగింపు
వ్యతిరేకించిన ప్రతిపక్ష నేత ఖర్గే
తొలగింపునకు ఓకే అన్న ప్రధాని మోడీ, సుప్రీం జడ్జి సిక్రి 
2:1 మెజారిటీ నిర్ణయంతో వర్మకు ఉధ్వాసన 

సీబీఐలో అంతర్యుద్ధమే అసాధారణమైతే… అది బట్టబయలైన నాటినుంచి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థ్రిల్లర్ సినిమాలో సీను సీనుకూ ఉత్కంఠ చెలరేగినట్టు సీబీఐ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అందులో తాజా పరిణామం… సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను రెండోసారి తొలగించడం..! రెండున్నర నెలల క్రితం తొలిసారి తొలగించిన వర్మను రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో పునర్నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశించి 48 గంటలు గడవక ముందే మళ్ళీ వర్మను తొలగించడం.. అది కూడా హైపవర్ కమిటీలో సుప్రీంకోర్టు ప్రతినిధి మద్ధతుతోనే కావడం ఆశ్చర్యకర పరిణామం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ గురువారం సమావేశమై వర్మపై నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసు ప్రత్యేక చట్టం ప్రకారం.. ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేస్తుంది. గత అక్టోబర్ లో… ఆ కమిటీ అనుమతి లేకుండా ప్రధాని మోడీ అదేశాలమేరకు సీబీఐ డైరెక్టర్ వర్మను తొలగించారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. హై పవర్ కమిటీ ముందస్తు అనుమతి లేకుండా సీబీఐ డైరెక్టర్ ను విధులనుంచి తప్పించడం చట్ట విరుద్ధమని రెండు రోజుల క్రితం తీర్పులో స్పష్టం చేసింది.

అలోక్ వర్మను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్ పదవిలో పునర్నియామకానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, హై పవర్ కమిటీ సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ప్రధానమైన విధాన నిర్ణయాలేవీ తీసుకోవద్దని వర్మకు సూచించింది. వర్మ బుధవారం తిరిగి బాధ్యతలు తీసుకొని తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు చేసిన కొన్ని బదిలీలను రద్దు చేశారు. సుప్రీం ఉత్తర్వులు వచ్చి రెండు రోజులు గడవక ముందే ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని ప్రధానమంత్రి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే హాజరు కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తరపున జస్టిస్ ఎ.కె. సిక్రి హాజరయ్యారు.

ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు పద్ధతిగా ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మరీ… తన పంతాన్ని మోడీ నెగ్గించుకున్నారు. అంటే తాను గతంలో చట్ట విరుద్ధంగా తొలగించిన వ్యక్తినే ఇప్పుడు చట్టబద్ధంగా మరోసారి తొలగించారు. చిత్రమేమిటంటే… రెండు రోజుల క్రితం వర్మను పునర్నియమించాలని ఆదేశించిన సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతినిధే గురువారం ఆయన తొలగింపునకు ఓకే అనడం!!

వారించిన ఖర్గే

ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడైన ప్రతిపక్ష నేత (లోక్ సభ) మల్లిఖార్జున ఖర్గే వర్మ తొలగింపును వ్యతిరేకించారు. వర్మ తొలగింపునకు ఆధారంగా చెబుతున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదికను సమర్పించాలని ఖర్గే కోరారు. అంతేకాదు… వర్మను కమిటీ ముందుకు పిలిపించి తన వాదన వినాలని సూచించారు. అయితే, ప్రధాని మోడీ ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు.

వర్మ ఈ నెల 31వ తేదీన రిటైర్ కానున్నారు. ఈలోగా ఆయనను ఫైర్ సర్వీసుల డీజీగా నియమించారు. వర్మను కొనసాగించడంతోపాటు పదవీ కాలాన్ని 77 రోజులపాటు పొడిగించాలని.. ఖర్గే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో కోరినట్టు వార్తలు వచ్చాయి.

మళ్లీ నాగేశ్వరరావే (తాత్కాలిక) డైరెక్టర్

సీబీఐ అదనపు డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావును తిరిగి తాత్కాలిక డైరెక్టర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావును తొలిసారిగా గత అక్టోబర్ లో తాత్కాలిక డైరెక్టర్ గా నియమించారు. అప్పట్లో డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్తానా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కేసులు నమోదు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇద్దరినీ తొలగించింది.

ప్రధానమంత్రికి సన్నిహితుడైన గుజరాత్ కేడర్ అధికారి, అత్యంత వివాదాస్పదుడు అయిన రాకేష్ ఆస్తానాను కాపాడటానికే వర్మను తప్పించారని ఆరోపణలు వచ్చాయి. దానికి తోడు… రాఫేల్ కుంభకోణానికి సంబంధించి వర్మ విచారణ జరపాలని భావించిన నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నారని పొక్కడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.

తన తొలగింపును, అందుకు చూపిన కారణాలను వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వర్మ వాదనలోని కొన్ని అంశాలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు పునర్నియామకానికి ఆదేశించింది. దాంతో… తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు నియామకం రద్దయింది. ఇప్పుడు మళ్ళీ వర్మను తప్పించి నాగేశ్వరరావును మరోసారి తాత్కాలిక డైరెక్టర్ గా నియమించారు. పూర్తి స్థాయి డైరెక్టర్ ను ప్రభుత్వం ఎంపిక చేసి.. ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకునే వరకు నాగేశ్వరరావు కొనసాగుతారు.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %