ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, రాష్ట్రంలోని 25 లోక్ సభా స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్ సభా స్థానాలకు ఒకేసారి ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 25వ తేదీ వరకు గడువు ఉంటుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన తర్వాత ఉప సంహరణకు 28వ తేదీ అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ పూర్తయితే మే 23వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏప్రిల్ 11వ తేదీన తెలుగు రాష్ట్రాలతోపాటు మరో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్ సభ సీట్లకు తొలి దశ పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్ సభతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకూ పోలింగ్ జరుగుతుంది. 2014లో లోక్ సభతో పాటే అప్పటి ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత రెండు అసెంబ్లీలు ఏర్పడ్డాయి. అయితే, ఈసారి తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో ఆ రాష్ట్రంలో ఇప్పటికే కొత్త అసెంబ్లీ ఏర్పాటైంది.
2014లో లోక్ సభ ఎన్నికలతోపాటు మొత్తం 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి తెలంగాణను మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు వివిధ దశల్లో పోలింగ్ జరుగుతుంది. అన్ని దశలూ పూర్తయ్యాక మే 23న ఒకేసారి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.