విద్యార్ధుల వివరాలకు ఆధార్ అనుసంధానం

0 0
Read Time:3 Minute, 52 Second
విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు


ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్ధి వివరాలను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానించాలని, అందరి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విద్యాశాఖ అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు, సాధించాల్సిన లక్ష్యాలపై పలు సూచనలు చేశారు. విద్యార్ధుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సర్వేలో భాగంగా ఇప్పటివరకు 62% పాఠశాల విద్యార్ధుల నమోదు ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు చెప్పగా, 100% నమోదు లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్ధుల నుంచి బయోమెట్రిక్ హాజరు వంద శాతం తీసుకోవాలని, వర్చువల్ క్లాస్ రూములు ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు. 220 ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించడం, విద్యాసంస్థల్లో ఓడీఎఫ్ సంపూర్ణ అమలు మన ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం అమలు చేయాలని చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకు రేటింగ్ ఇవ్వడంతో పాటు, ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని అన్నారు.

విద్యార్ధుల సందేహాల నివృత్తి కోసం ఉపాధ్యాయులు సమాధానాలు చెప్పేందుకు, పలు విషయాలపై చర్చించేందుకు, సమీక్షించేందుకు, ఇ-కంటెంట్ కోసం ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ ఇ-నాలెడ్జ్ ఎక్స్చేంజ్ (ఏపీఈకేఎక్స్) పోర్టల్ ప్రవేశపెట్టినట్టు అధికారులు చెప్పారు. కేంద్రం ఇదే తరహాలో తీసుకొచ్చిన ‘దీక్ష’ పోర్టల్‌తో దేశంలో మొట్టమొదటగా అనుసంధానమైన పోర్టల్ మనదేనని వివరించారు. ఏపీఈకేఎక్స్ 130 మంది విషయ నిపుణులు సేవలు అందిస్తున్నారని అన్నారు.

అవసరమైతే వారానికోసారి సమీక్ష

విద్యాశాఖ గాడిలో పడేవరకు అవసరమైతే వారానికోసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వాస్తవరూపం దాల్చని సిద్ధాంతాలు, సుదీర్ఘ లక్ష్యాల గురించి తనకు అవసరం లేదని, వచ్చే ఏడాది నాటికి ఏం సాధిస్తామనేది ముఖ్యమని అధికారులకు స్పష్టం చేశారు. మనం చేసే ప్రతి పనిలో వాస్తవికత వుండాలని, గడిచిన మూడున్నరేళ్లలో మన విద్యావ్యవస్థలో ఎంతమేర ప్రమాణాలు పెంచగలిగారో వచ్చే సమావేశం నాటికి సవివర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. డిజిటల్ తరగతులకు సంబంధించి పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply