ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యాన్ని చాటుతూ ప్రభుత్వం ‘ఆనంద ఆదివారం’ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న చోటనే మహావిషాధం చోటు చేసుకుంది. కృష్ణమ్మకు నిత్యహారతులిచ్చే ప్రదేశంలోనే విహారయాత్రికులు జలసమాధి అయ్యారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో ఆదివారం ఓ ప్రైవేటు బోటు నీట మునిగి 16 మంది మృత్యువాత పడ్డారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు.
ఒంగోలు వాకర్స్ క్లబ్ నుంచి సుమారు 60 మంది విహారంకోసం విజయవాడ వచ్చారు. ఆదివారం సాయంత్రం వారంతా విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి ఎగువ ప్రాంతంలోని ఇబ్రహీంపట్నంవద్ద ఉన్న పవిత్ర సంగమం వరకు బోటులో వెళ్ళాలనుకున్నారు. టూరిజం బోటులో వెళ్ళడానికి వారు ప్రయత్నించినప్పుడు.. సిబ్బంది సమయం మించిపోయిందని చెప్పి నిరాకరించారు. దీంతో వారిలో 32 మంది రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ అనే ప్రైవేటు సంస్థ బోటు ఎక్కారు. పవిత్ర సంగమం సమీపానికి వెళ్ళాక ప్రమాదం సంభవించింది. ఓ మట్టిదిబ్బకు తగిలిన బోటు కుదుపులతో ఒరిగిపోయింది.
బోటు సామర్ధ్యానికి మించి మొత్తం 38 మందిని ఎక్కించడం, బోటు డ్రైవర్ అనుభవరాహిత్యం వెరసి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బోటునుంచి 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోల్తా పడిన బోటు కింద చిక్కుకొని 16 మంది మరణించారు. ఇంకొంత మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సహాయ చర్యలకు సమయం పట్టడంతో బాధితులు కొంతమంది తిరగబడ్డ బోటు అంచులను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఎస్డీఆరెఫ్, ఎన్డీఆరెఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు బోటు కింద చిక్కుకుని ఉన్న మృత దేహాలను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గల్లంతైనవారిలో కొంతమంది నెల్లూరు జిల్లాకు చెందినవారున్నట్టు సమాాచారం.
అనుమతి లేని బోటు.. అవగాహన లేని డ్రైవింగ్!
పవిత్ర సంగమం, ప్రకాశం బ్యారేజీ మధ్య బోటు విహారానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టూరిజం శాఖతోపాటు పలువురు ప్రైవేటు ఆపరేటర్లు కూడా పడవలు నడుపుతున్నారు. అయితే, రివర్ బోటింగ్ అడ్వంచర్స్ సంస్థకు సాధారణ బోట్లు నడపడానికి అనుమతి లేదని ఆదివారం దుర్ఘటన తర్వాత రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, అఖిలప్రియ చెప్పారు. మూడు నాలుగు బోట్లకు అనుమతి తీసుకొని ఎక్కువ బోట్లు నడుపుతున్నారని అఖిలప్రియ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రమాదానికి గురైన బోటును ఆదివారమే తొలిసారిగా ట్రయల్ రన్ నిర్వహించి నడిపినట్టు చెబుతున్నారు. ఇంతమంది మరణానికి కారణమైన బోటు ఆపరేటర్ పైన క్రిమినల్ కేసు పెడతామని పోలీసులు ప్రకటించారు.
బోటు నిర్వాహకులు లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదని ప్రమాదం నుంచి బయటపడినవారు ఆరోపించారు. బోటు కెపాసిటీకి మించి ఎక్కువ మందిని ఎక్కించడం, పవిత్ర సంగమ ప్రదేశాన్ని సమీపించే సందర్భంలో మట్టి దిబ్బను తాకి కుదుపులు రావడం, ఆ సందర్భంలో తలెత్తిన డ్రైవింగ్ లోపం ప్రమాదానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. లైఫ్ జాకెట్లు లేకపోవడం, తిరగబడిన బోటు కింద ఎక్కువమంది చిక్కుకోవడం, గజ ఈతగాళ్ళు వెంటనే అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మృతుల సంఖ్య పెరిగింది.
టూరిజం శాఖలో అధికారుల సహకారంతోనే అనుమతి లేని బోట్లు రంగంలోకి వచ్చాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లనే టూరిజం బోట్లకంటే ప్రైవేటు బోట్లను ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. ఆదివారం టూరిజం బోటులో సమయం మించిపోయిందనే పేరిట టూరిస్టులను ఎక్కించుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. కాగా, మృతులలో చంద్రన్న బీమా ఉన్నవారికి రూ. 10 లక్షలు, బీమా లేనివారికి రూ. 8 లక్షలు చొప్పున పరిహారం అందుతుందని ప్రభుత్వం తెలిపింది.
సమగ్ర విచారణకు ఆదేశం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బోటు ప్రమాదం తర్వాత ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ సహాయ చర్యలను పర్యవేక్షించారు. బోటు ప్రమాదంపై విచారణకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ఆయన ఆదేశించారు. ఈ కమిటీలో ఒక ఐఎఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఉంటారని సమాచారం. ప్రమాద కారణాలు, బాధ్యులను నిర్ధారించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడానికి తీసుకోవలసిన చర్యలనూ ఈ కమిటీ సూచిస్తుందని తెలిసింది.