వీకెండ్లో విరామమే…! జగన్ పాదయాత్ర ఆశలపై కోర్టు నీళ్ళు

వ్యక్తిగత హాజరునుంచి మినహాయించడానికి సీబీఐ కోర్టు నిరాకరణ

పిటిషన్ కొట్టివేత.. జగన్ హైకోర్టుకు వెళ్ళే అవకాశం

నవంబర్ 2వ తేదీనుంచి ఆరు నెలలపాటు నిరంతరాయంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలనుకున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశలపై సీబీఐ కోర్టు నీళ్ళు చల్లింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలనే నిబంధననుంచి మినహాయింపు ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. దీంతో (ఇంతకు ముందే కోర్టు వ్యాఖ్యానించినట్టు) వీకెండ్లో పాదయాత్ర కష్టం నుంచి జగన్మోహన్ రెడ్డికి విరామం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా క్విడ్ ప్రోకోతో ఆస్తులు సంపాదించారనే అభియోగాలను జగన్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన కేసులను ఓవైపు సీబీఐ, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి. ఆ కేసుల విషయంలో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాలన్నది నిబంధన.

ఆ నిబంధన నుంచి మినహాయింపు కోరుతూ గతంలో ఓసారి జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బదులు తన లాయర్ హాజరవుతారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, హైకోర్టు ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో.. వచ్చే ఎన్నికలకోసం జగన్ తండ్రి తరహాలో పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి కోర్టు హాజరు నిబంధన అవరోధం అవుతుందని భావించి మినహాయింపు కోరుతూ మరోసారి పిటిషన్ వేశారు. ఈసారి మరో సెక్షన్ కింద పిటిషన్ వేస్తూ.. కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

దీనిపై జగన్ తరఫు లాయర్ వాదనలు విన్న కోర్టు… అప్పుడే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాదయాత్రకు శుక్రవారం విరామం ఇచ్చి కోర్టుకు హాజరైతే… విశ్రాంతికి విశ్రాంతి దొరుకుతుందని, మరోవైపు కోర్టును గౌరవించినట్టు ఉంటుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అదే సమయంలో సీబీఐ, ఈడీ వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వవద్దని కోరుతూ కౌంటర్ దాఖలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావడం నుంచి తప్పించుకోవడానికే పాదయాత్ర పేరిట పిటిషన్ వేశారని ఆయా సంస్థలు వాదించాయి.

కేసుల విచారణలో జాప్యాన్ని నిరోధించాలని, జగన్ పిటిషన్ ను తిరస్కరించాలని దర్యాప్తు సంస్థలు సీబీఐ న్యాయస్థానాన్ని కోరాయి. జగన్ తాజా పిటిషన్  తిరస్కరిస్తూ తన నిర్ణయాన్ని సోమవారం వెల్లడించిన సీబీఐ కోర్టు… గతంలో హైకోర్టు తిరస్కరించిన అంశాన్నీ ఉటంకించింది. పాదయాత్రకు వీకెండ్లో విరామం ఇస్తే సీరియస్ నెస్ తగ్గుతుందని కోర్టుకు నివేదించిన జగన్… ఇప్పుడేం చేస్తారన్న విషయమై ఆసక్తి నెలకొంది.

సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హైకోర్టు ఒక పిటిషన్ ను తిరస్కరించినా… అప్పటి విన్నపానికీ ఇప్పటి పిటిషన్ కూ తేడా ఉందని, అందువల్ల హైకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

Leave a Comment