వెనిజులా అధ్యక్షుడిపై డ్రోన్ బాంబులతో దాడి

2 0
Read Time:3 Minute, 23 Second

నికోలస్ మదురో సేఫ్… హత్యాయత్నం విఫలం

మిలిటరీ కార్యక్రమంలో మాట్లాడుతుండగా సమీపంలో పేలుళ్ళు

ఏడుగురు సైనికులకు గాయాలు

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో లక్ష్యంగా డ్రోన్ బాంబుల దాడి జరిగింది. డ్రోన్లలో బాంబులు నింపి జరిపిన ఈ సరికొత్త దాడిలో మదురోకు ఏమీ కాలేదు. ఒక మిలిటరీ కార్యక్రమంలో మదురో ప్రసంగిస్తుండగా డ్రోన్లు వరుసగా పేలిపోయాయి. పేలుళ్ళ శబ్ధం వినిపించి ప్రసంగాన్ని ఆపినా మదురో తొణకకుండా వేదికపైనే ఉన్నారు. వెంటనే మదురో సెక్యూరిటీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో ఆయన చుట్టూ వలయాన్ని నిర్మించి అక్కడినుంచి తీసుకెళ్ళిపోయారు.

బొలీవియన్ ఆర్మీ 81వ వార్షికోత్సవంలో మాట్లాడుతున్న మదురో

మదురో లక్ష్యంగానే దాడి జరిగినట్టు వెనిజులా సమాచార శాఖ మంత్రి జార్జ్ రోడ్రిగెజ్ నిర్ధారించారు. అధ్యక్షుడి వేదిక సమీపంలో బాంబులు నింపిన పలు డ్రోన్లు పేలినట్టు ఆయన తెలిపారు. మదురోను సురక్షితంగా అక్కడినుంచి తరలించామని, ఆయన యథావిధిగా తన పనులు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. వెనిజులా నేషనల్ గార్డ్ సైనికులు ఏడుగురు ఈ దాడి ఘటనలో గాయపడ్డారు. అయితే, గాయాల తీవ్రతను ప్రభుత్వం వెల్లడించలేదు.

అధ్యక్షుడిపై జరిగిన డ్రోన్ బాంబు దాడిలో గాయపడిన సైనికులు

వెనిజులా సోషలిస్టు నేత హ్యూగో చావెజ్ వారసుడిగా అధికార పగ్గాలు చేపట్టిన మదురోపై దాడి ఇదే తొలిసారి కాదు. అయితే, తాజా దాడి హత్యాయత్నాల్లో సరికొత్త మార్గమని చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా డ్రోన్లలో బాంబులు నింపి దాడి చేసినా.. మదురోపై హత్యాయత్నం విఫలమైంది. కొన్ని డ్రోన్లను మదురో రక్షక దళం కూల్చివేసింది.

మదురోను గద్దె దించడానికి అమెరికా మద్ధతుతో ప్రతిపక్షాలు చేయని ప్రయత్నం లేదు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో కూడా విజయం సాధించి మదురో వారి ఆశలపై నీళ్ళు చల్లారు. ఛావెజ్, మదురోల మార్గం నచ్చని అమెరికా విధించిన ఆంక్షల కారణంగా వెనిజులా ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉంది. తాజా దాడి జరిగిన సమయంలో కూడా మదురో బొలీవియన్ నేషనల్ ఆర్మీ (జి.ఎన్.బి) 81వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. తాజా దాడి ఎవరు చేశారన్న విషయం తేలాల్సి ఉంది.

భవనాలపై బాంబు పేలుళ్ళ గుర్తులు

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %
%d bloggers like this: