తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీరియస్ ఎజెండా నడుస్తోంది. 2018 బడ్జెట్ తర్వాత కేంద్రంతో పార్టీ సంబంధాలు ఎలా ఉండాలి? ఇదే చర్చనీయాంశం. ఎంపీలంతా తలో మాట చెబుతున్నారు. ఎప్పుడూ మాట్లాడుతుండే అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి మాత్రం రెండున్నర గంటల పాటు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా సునామీలా విరుచుకుపడ్డారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆచితూచి స్పందిస్తుంటే జేసీ సంవాదానికి దిగారు.
పార్టీ అధినేత వ్యూహత్మకంగా మాట్లాడుతుంటే జేసీ దివాకరరెడ్డి ఏకపక్షంగా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం సహకరించడంలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే సహాయనిరాకరణ చేస్తోందని ఇతరులు కూడా చెప్పిన విషయాన్నే జేసీ కూడా పునరుద్ఘాటించారు. అయితే, బడ్జెట్ నేపథ్యంలో బీజేపీతో తెగతెంపులు చేసుకునే విషయంలోనే ఆయన మిగిలినవారికంటే తీవ్రంగా వాదించారు.
బీజేపీతో రాజకీయంగా తెగతెంపులు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని, ఇక కలసి వెళ్ళడం నష్టదాయకమని జేసీ వాదించారు. రాష్ట్ర ప్రజల్లో కేంద్రంపైన, బీజేపీపైన తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి తప్పుకోవాలన్న వాదనను సమర్ధించారు. దీనికి స్పందించిన చంద్రబాబు…‘‘మనకు పదవులు ముఖ్యం కాదు. కేంద్రం నుంచి తప్పుకోవడానికి, మంత్రివర్గంలో ఉన్న మనవాళ్ళు రాజీనామా చేయడానికీ నిమిషం పట్టదు. అయితే, ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో మన అసంతృప్తిని వ్యక్తం చేయాలి. రావలసినవి సాధించుకోవడానికి చివరి ప్రయత్నం చేయాలి. వాళ్ళ స్పందనను బట్టి మన ప్రతిచర్య ఉంటుంది’’ అని చంద్రబాబు బదులిచ్చారు.
కొద్దిసేపు సంవాదం నడిచిన తర్వాత చంద్రబాబు మరింత స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రజల ఆకాంక్షలమేరకు ఏ త్యాగానికైనా సిద్ధమే’’ అని చంద్రబాబు ఉద్ఘాటించడంతో జెసి దివాకర్ రెడ్డి బిగ్గరగా చప్పట్లు చరిచారు. సమావేశం చివరల్లో ఇంత హడావుడి చేసిన జేసీ దివాకర్ రెడ్డి ముందు రెండున్నర గంటలపాటు ఎందుకు మౌనంగా ఉన్నారంటే… సుగర్ లెవల్స్ పడిపోవడంవల్ల కాస్త నలతగా ఉందట.