ఆహ్వానించని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వెళ్లిపొమ్మన్నందుకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి గిరిజా శంకర్ సారీ చెప్పారు. ఈమేరకు ఆయన గన్నవరం ఎమ్మెల్యేకు ముందుగా ఫోన్లో మెసేజ్ పెట్టినట్లు సమాచారం. అప్పటికీ వంశీ మెత్తబడకపోవడంతో రాత్రికి ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడారు. దీంతో.. ఉదయం ఘర్షణ పడిన ఆ ఇద్దరూ రాత్రికి కరచాలనం చేసుకున్నారు.
బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడంతో.. దాని పరిధిలోని రైతులు చెరకు ఎక్కడ అమ్మాలన్న అంశంపై చర్చకోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసీపీ, ఆంధ్రా సుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో పాటు గోకరాజు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. తన నియోజకవర్గం రైతుల తరఫున వచ్చిన వంశీకి ఆహ్వానం లేదని గిరిజా శంకర్ చెప్పడంతో ఎమ్మెల్యే నొచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ.. వంశీ కన్నీటితో అక్కడ నుంచి వెళ్తూ రాజీనామా చేస్తాననే వరకు ఉద్రిక్తతను పెంచింది.
ఈ వివాదం ఇటు ఐఎఎస్ అధికారులు, అటు రాజకీయ నాయకుల్లో చర్చకు దారి తీసింది.దీనిపై ముఖ్యమంత్రి స్వయంగా కలుగజేసుకోవలసి వచ్చింది. అంతకు ముందే ముఖ్యమంత్రి తనయుడు, ఐటి- గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావుతో మాట్లాడారు. వంశీతో మాట్లాడాలని కళాకు చెప్పారు. రైతుల సమస్యపై మాట్లాడబోతే తనకు అవమానం జరిగిందని వంశీ పార్టీ అధ్యక్షుడు కళా వద్ద కూడా వాపోయారు.
ఈ దౌత్యం ఫలితంగానే గిరిజా శంకర్ సారీ చెప్పడం, వంశీ ముఖ్యమంత్రిని కలవడం, గిరిజా శంకర్ తో కరచాలనం చక చకా జరిగిపోయాయి.