సీన్ రివర్స్… చంద్రబాబుకు బొండా పాదాభివందనం

కొద్ది నెలల క్రితం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు తనకు అవకాశం దక్కలేదని అధినేతపైనే మండిపడ్డారు విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. కాపులకు అన్యాయం జరిగిందని అప్పట్లో ఆరోపించారు. అలాంటి ఫైర్ బ్రాండ్ బొండా ఇప్పుడు చంద్రబాబే కాపులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడని పొగడ్తలు కురిపించారు. అంతటితో ఆగలేదు. శనివారం శాసనసభ ఆవరణలోనే చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. కాపు రిజర్వేషన్లకోసం అదనపు కోటాను కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు శాసనసభ ఆమోదం పొందిన నేపథ్యంలో బొండా ఉమ ముఖ్యమంత్రిని కలసి పాదనమస్కారం చేశారు. అంతకు ముందు శాసనసభలో బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.

ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా కాపులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నదని బొండా ఉమ వ్యాఖ్యానించారు. కాగా, ఇతర కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.

మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రిని కలసి మిఠాయిలను పంచుకున్నారు. కాపులను బీసీలలో చేర్చిన నిర్ణయానికి కాపు వర్గాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని మంత్రులు గంటా శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. గత రెండు దశాబ్దాల్లో కాపులకు ఎవరూ చేయనిది తాము చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Related posts

Leave a Comment