సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పునర్నియామకానికి ‘సుప్రీం’ ఆదేశం

1 0
Read Time:6 Minute, 8 Second
మోడీ ప్రభుత్వానికి మొట్టికాయ
అలోక్ వర్మకూ పరిమితులు
ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకోవద్దని సూచన

సీబీఐ అంతర్గత వ్యవహారాల్లో శ్రుతిమించి జోక్యం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇది చేదువార్త. తొలగించిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను పునర్నియమించాలని భారత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్వర్యంలోని బెంచ్ మంగళవారం ఈ అంశంపై ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ పూర్తయ్యేవరకు పెద్ద విధాన నిర్ణయాలేవీ తీసుకోవడానికి వీల్లేదని అలోక్ వర్మకు స్పష్టం చేసింది.

సీబీఐ కేసును ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్తానాతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ వర్మనూ బాధ్యతలనుంచి తప్పిస్తూ అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి నిర్ణయం వెలువడింది. ఇప్పుడా ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్ట ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికిగానీ, విజిలెన్స్ కమిషన్ కు గానీ సీబీఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని కుదించే అధికారం లేదని జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ ముందస్తు అనుమతి లేకుండా తనను బాధ్యతలనుంచి తప్పించడం కుదరదన్న అలోక్ వర్మ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఢిల్లీ పోలీసు ప్రత్యేక చట్టం (డి.ఎస్.పి.ఇ) ప్రకారం సీబీఐ డైరెక్టర్ పై ముగ్గురితో కూడిన కమిటీయే సీబీఐ డైరెక్టర్ ను నియమిస్తుంది.

కాగా, వర్మ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం… హైపవర్ కమిటీ సమావేశంలోపు వర్మ ఎలాంటి విధాన నిర్ణయాలూ తీసుకోవడానకి అవకాశం లేదు. ఆ కమిటీ వారంలోగా సమావేశం కానున్నట్టు సమాచారం. వర్మ రిటైరయ్యేలోపు పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వర్తించడమా.. లేదా? అన్నది హైపవర్ కమిటీ చేతిలో ఉంది.

మోడీ ఇష్టుడికోసం…

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ గా గుజరాత్ కేడర్ అధికారి, మోడీకి మహా ఇష్టుడైన రాకేష్ ఆస్తానాను నియమించినప్పటినుంచి అంతర్యుద్ధం ముదిరింది. రాకేష్ ఆస్తానాపై పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చివరికి సొంత ఏజన్సీనే ఆయనపై కేసు నమోదు చేసే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో అలోక్ వర్మ పైనా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)కు ఆస్తానా ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆస్తానాను కాపాడటానికి ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలను సాకుగా చూపించి ఇద్దరినీ పదవులనుంచి తప్పించింది. ఈ ఆదేశాలను వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తనను  తప్పిస్తూ ఇచ్చిన ఆదేశాల చట్టబద్ధతను వర్మ ప్రశ్నించారు. విజిలెన్స్ కమిషన్ విచారణ తీరును కూడా వర్మ తప్పు పట్టారు. ఈ అంశంపై వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు డిసెంబర్ 6వ తేదీన తీర్పును రిజర్వు చేసింది.

అర్దరాత్రి సమయంలో వర్మను తప్పించాల్సిన అగత్యం ఏమి వచ్చిందంటూ జస్టిస్ రంజన్ గొగోయ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. ఇద్దరు ఉన్నతాధికారులు పరస్పరం కేసులు నమోదు చేసుకునే స్థితి రావడంతోనే అత్యవసర నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని మెహతా బదులిచ్చారు.

ముందస్తు అనుమతి లేకుండా ఎలా?

సీబీఐ డైరెక్టర్ రెండేళ్ల పదవీ కాలం ముగియక ముందే తప్పించడానికి… ప్రభుత్వంగానీ, విజిలెన్స్ కమిషన్ గానీ ప్రధానమంత్రి ఆధర్వ్యంలోని కమిటీ ముందస్తు అనుమతిని ఎందుకు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం, విజిలెన్స్ కమిషన్ ఏ సమాధానమూ చెప్పలేదని కూడా కోర్టు ఎత్తిచూపింది. డి.ఎస్.పి.ఇ చట్టంలోని సెక్షన్ 4ను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మీరగలదా? అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రశ్నించారు.

సీబీఐ డైరెక్టర్ ను ఉన్నత స్థాయి కమిటీ అనుమతి లేకుండా బదిలీ చేయడంగానీ, బాధ్యతలనుంచి తప్పించడంగానీ కుదరదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. అయితే, వర్మను తప్పించడం అన్నది బదిలీ కిందకు రాదని, అంతకంటే తక్కువ స్థాయి చర్య అని సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు.

 

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %