నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్
2017 నగర నేర నివేదిక వెల్లడి
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రకటిత రాజధానిగా ఉన్న విజయవాడ నగరం మెట్రోపాలిటన్ రాజధాని లక్షణాలను వేగంగా వంటబట్టించుకుంటోంది. సైబర్ నేరాలు బాగా పెరుగుతుండటం ఆ లక్షణాల్లో ఒకటిగా ఉంది. గతంతో పోలిస్తే విజయవాడలో సైబర్ నేరాలు బాగా పెరిగాయని నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ స్వయంగా వెల్లడించారు. 2017 ముగుస్తున్న సందర్భంగా శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశాన్నినిర్వహించిన సవాంగ్ విజయవాడ వార్షిక నేరాల నివేదికను విడుదల చేశారు.
సవాంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం విజయవాడలో గత ఏడాది కాలంలో 185 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలపై 120 కేసులు నమోదు కాగా 46 కేసులను ఛేదించినట్టు ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సవాంగ్ సూచించారు. సవాంగ్ నివేదిక ప్రకారం… నగరంలో మహిళలపై నేరాల్లో పెరుగుదల నమోదు కాగా, దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. కాల్ మనీ వ్యవహారంపై ఈ ఏడాది 1827 ఫిర్యాదులు అందాయని, 1772 ఫిర్యాదులపై విచారణ జరిపి 834 పరిష్కరించామని సవాంగ్ తెలిపారు.
2017 విజయవాడ నేర నివేదిక ముఖ్యాంశాలివి
- మర్డర్లు 33, కిడ్నాప్ లు 31, అత్యాచారం కేసులు 77.
- మానసిక వేధింపుల కేసులు 59
- మహిళలకు సంబంధించిన కేసులు 992.
- ఆత్మహత్యలకు ప్రేరేపణ, కుటుంబ వేధింపులు, నమ్మించి మోసం చెసిన ఘటనలు, మహిళలను అవమానించిన కేసులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి.
- బాలికల అదృశ్యానికి సంబంధించి 148 కేసులు నమోదయ్యాయి. అందులో 142 మంది బాలికలను ట్రేస్ చేసి బంధువులకు అప్పగించారు. మిగిలిన 6 గురు బాలికల కోసం గాలిస్తున్నారు.
- ఆస్తి సంబంధ నేరాలు 2051 నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి.
- చైన్ స్నాచింగ్ కేసులు 80 నమోదయ్యాయి. ముఠాలపై నిఘా పెట్టడంతో గత ఏడాది కంటే తగ్గాయి.
- గ్యాంబ్లింగ్, ఇతర జూదాల కేసులు 2017లో 2,375. స్వాధీనం చేసుకున్న సొమ్ము రూ.30, 25,172 .
- గంజాయి అక్రమ రవాణాపై 16 కేసులు నమోదు, 65 మంది అరెస్ట్.
- రోడ్డు ప్రమాదాలు మొత్తం 1613 జరగగా అందులో 360మంది చనిపోయారు. 1486 మందికి గాయాలయ్యాయి.
- ఈ ఏడాది 5,498 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా న్యాయస్థానాల్లో 207 మందికి శిక్షలు పడ్డాయి. మిగిలిన వారికి పోలీసులే ఫైన్ విధించారు.
అప్రమత్తతతో కొన్ని నేరాలు తగ్గాయి
రాజధాని ప్రాంతంలో సరికొత్త సవాళ్ళను అధిగమిస్తూ సమయస్ఫుర్తితో వ్యవహరించి అనేక కేసులను ఛేదించామని సవాంగ్ చెప్పారు. మహిళలు కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి సమస్యలపై ఫిర్యాదు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. కుల, వర్గ, మతపరమైన ఉద్రిక్తతలు, ఆందోళనలు, జన సమీకరణ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించి ఘర్షణలను నివారించామని సవాంగ్ చెప్పారు. విజయవాడ నగరంలో 907 సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నగర పోలీసు విభాగం ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాథ్యమాల ద్వారా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు సవాంగ్ చెప్పారు.