హిమాచల్ ఎన్నికల్లో ఓటేసిన స్వేచ్ఛా భారత తొలి ఓటరు

శ్యామ్ శరణ్ నేగి.. హిమాచల్ ప్రదేశ్ నివాసి. 100 సంవత్సరాల వయసులో గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. శతాధిక వృద్ధుడు ఓటు వేయడం ఓ విశేషం అనుకుంటే శ్యామ్ శరణ్ విషయంలో అసలు సిసలు విశేషం మరొకటి ఉంది. ఆయన స్వతంత్ర భారతంలోనే తొలి ఓటరు. 1951లో స్వతంత్ర భారతీయుడిగా తొలిసారి ఓటు వేసిన శ్యామ్ శరణ్.. ఇప్పటికీ తన హక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు.

1947లో బ్రిటిష్ పాలన అంతమైన తర్వాత దేశంలో తొలిసారిగా 1951లో ఎన్నికలు జరిగాయి. నిజానికి భారతదేశమంతటా ఎన్నికలు 1952 ఫిబ్రవరిలో జరిగాయి. అయితే, ఆ సమయానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో హిమపాతం ఎక్కువగా ఉంటుందన్న కారణంగా.. అక్కడ ఐదు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా 1951 అక్టోబర్ 25వ తేదీన గిరిజన జిల్లా కిన్ననూరులో పోలింగ్ జరిగింది. ఆ విధంగా… స్వతంత్ర భారతంలో ఎన్నికలు జరిగిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, ఓటు వేసిన తొలి వ్యక్తిగా శ్యామ్ శరణ్ నేగి పేర్లు రికార్డుల్లో పదిలమయ్యాయి.

స్వేచ్ఛాభారతంలో ఓటు హక్కుకు శ్యామ్ శరణ్ నేగి ఒక సింబల్ గా మారిపోయారు. కిన్ననూర్ జిల్లాలో మొదటి ఎన్నికల్లో ఓటు వేసినవారిలో జీవించి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నేగి. 2010లో భారత ఎన్నికల కమిషన్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా చీఫ్ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా హిమాచల్ వెళ్ళి నేగి గ్రామాన్ని సందర్శించారు. 1951 నుంచి ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయడం మరచిపోలేదని ఆయన చెబుతారు. అంతే కాదు.. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటు వేస్తానని ఉత్సాహంగా చెబుతారు. ఇటీవల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేగి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.

Related posts

Leave a Comment