హెచ్1బి నిపుణులకు అమెరికా ఎర్ర జెండా

అమెరికా ఉద్యోగాల రక్షణ బిల్లుకు జ్యుడిషియరీ కమిటీ గ్రీన్ సిగ్నల్
హౌస్ ఆమోదంతో వైట్ హౌస్ కు చేరితే ఆచరణలోకి…
ఇక హెచ్1బి వీసాదారుల కనీస వేతనం 90 వేల డాలర్లు
ప్రతి మూడో సంవత్సరం ద్రవ్యోల్భణానికి అనుగుణంగా పెంపు
అమెరికన్ల స్థానంలో వీసాదారులను తీసుకోకుండా నిబంధనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కు స్వాగతం పలకడానికి సాక్షాత్తు ఇండియా ప్రదాని నరేంద్ర మోదీ ఎదురు చూస్తున్న వేళ… ఆ దేశంలో మాత్రం మన ఐటి నిపుణుల ప్రవేశానికి ద్వారాలు మూసేసే ప్రక్రియ వేగవంతమైంది. హెచ్1బి వీసాల ద్వారా అమెరికా వెళ్లే నిపుణులకు ఉపాధిని కఠినతరం చేసే బిల్లును ఆ దేశ హౌస్ జ్యుడిషియరీ కమిటీ ఆమోదించింది. ‘ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ (హెచ్ఆర్170)’గా వ్యవహరిస్తున్న ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్, అలాంటి బిల్లునే సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత వైట్ హౌస్ చేరుతుంది.

శ్వేత సౌథం వరకూ వెళ్తే… ఇండియన్ ఐటి నిపుణుల ఉద్యోగాలు కోత వేసే ప్రక్రియ సంపూర్ణమైనట్టే. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఈ ప్రక్రియకు ప్రేరణగా నిలిచిందే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హెచ్1బి వీసాలపై ఆంక్షలు విధించడం ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే దేశం ఇండియా. అందులో ఆంధ్రుల సంఖ్య గణనీయం. హెచ్1బి వీసాలతో అమెరికన్ ఉద్యోగాలను ఔట్ సోర్స్ చేయడంపై ప్రతిపాదిత జాబ్స్ చట్టంలో కఠిన నియంత్రణలు తెచ్చారు.

హెచ్1బి వీసాా పొందినవారి కనీస వార్షిక వేతనాన్ని 60 వేల డాలర్లనుంచి 90 వేల డాలర్లకు పెంచుతూ ఈ చట్టంలో నిబంధన ఉంది. అంటే… అంతకంటే ఎక్కువ వేతనం చెల్లిస్తేనే కంపెనీలు హెచ్1బి వీసా పొందినవారికి అమెరికాలో ఉద్యోగం ఇవ్వగలవు. అప్పుడు కూడా అమెరికన్ ఉద్యోగులను తొలగించి వీసాదారుడికి ఉద్యోగం ఇవ్వకూడదు. ఈ అవకాశాన్ని దాదాపు అసాధ్యం చేస్తోందీ బిల్లు. వలస విధానాల్లో సంస్కరణల పేరిట హెచ్1బి వీసాలతో ఉద్యోగాలకు వస్తున్నవారిని నియంత్రించే ప్రక్రియకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగా… అమెరికా కాంగ్రెస్ లోని ‘కోర్టులు, మేధోహక్కులు, ఇంటర్నెట్ సబ్ కమిటీ’కి ఛైర్మన్ గా ఉన్న డారెల్ ఇసా ‘ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ (హెచ్ఆర్170)’ బిల్లును ప్రతిపాదించారు. 2017 జనవరి 3వ తేదీన హౌస్ లో ప్రవేశపెట్టిన ఈ బిల్లును అదే రోజున జ్యుడిషియరీ కమిటీకి రిఫర్ చేశారు. సరిగ్గా 10 రోజుల తర్వాత జనవరి 13న ఈ బిల్లును జ్యుడిషియరీ కమిటీ తన పరిధిలోని ‘ఇమిగ్రేషన్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ’ సబ్ కమిటీకి రిఫర్ చేసింది.

ఈ బిల్లుపై ఇండియానుంచే కాకుండా స్వదేశంలోని పరిశ్రమ వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ట్రంప్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వీసా సంస్కరణలపై దూకుడు ప్రదర్శిస్తోంది. గతంలో 1998లో మాత్రమే వీసా సంస్కరణలను చేపట్టారు. అప్పట్లో హెచ్1బి వీసాలపై వచ్చేవారి కనీస వేతనాన్ని 60 వేల డాలర్లుగా నిర్ధారించారు. అప్పట్లో సగటు అమెరికన్ వార్షిక వేతనంకంటే ఇది ఎక్కువే. అయితే, ఆ తర్వాత హెచ్1బి వీసాలపై వచ్చేవారి కనీస వేతనాన్ని ద్రవ్యోల్భణానికి అనుగుణంగా సవరించలేదు. కాలక్రమంలో సగటు అమెరికన్ వేతనం ఇంతకంటే ఎక్కువ కావడంతో కంపెనీలు వీసాదారులను ప్రోత్సహించడం పెరిగింది.

ఇది స్థానికంగా అమెరికన్లలో అసంతృప్తికి కారణమైంది. దీన్ని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బలంగా ఉపయోగించుకున్నాడు. ‘అమెరికా ఫస్ట్’, ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే పేరిట అమెరికన్ల ఉద్యోగాలు, వాణిజ్య రక్షణలపై ప్రజలను ప్రేరేపించాడు. అందులో భాగంగానే హెచ్1బి వీసాలపైన కూడా గురి పెట్టారు. ఇప్పుడు వీసాదారుల వార్షిక వేతనాన్ని పెంచడమే కాకుండా ఇకపైన ప్రతి మూడో సంవత్సరమూ సవరించాలని అమెరికన్ జాబ్స్ ప్రొటెక్షన్ చట్టంలో ప్రతిపాదించారు. కంపెనీలు ఇండియా నుంచి ఉద్యోగులను తెచ్చుకోవాలనుకుంటే.. భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు.

కాంగ్రెస్ మన్, జ్యుడిషియరీ కమిటీ సమర్ధన

అయితే, ఈ బిల్లును ప్రవేశపెట్టిన డారెల్ ఇస్సా, హౌస్ జ్యుడిషియరీ కమిటీ ఛైర్మన్ బాబ్ గుడ్ లేట్ మాత్రం తమ సంస్కరణ ప్రతిపాదనను తెగ పొగిడేస్తున్నారు. ‘హెచ్1బి వీసా కార్యక్రమం ద్వారా అత్యంత నైపుణ్యంగల వ్యక్తులు అమెరికాకు రావడం ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా మేలు చేసింది. అయితే, ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమం దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది. అమెరికన్ వర్కర్లకు ఉద్యోగాల్లో కోత వేసి ఔట్ సోర్స్ చేయడాన్ని నిరోధించాలి’ అని ఇస్సా పేర్కొన్నారు. అమెరికన్ వర్కర్ల ఉద్యోగాలు కాపాడటానికి చేస్తున్న ‘ఇంగిత జ్ఞానంతో కూడిన మార్పు’గా ఈ పరిణామాన్ని ఇస్సా నిర్వచించారు.

‘మన వలస విధానాలు అమెరికన్ వర్కర్ల, అమెరికా జాతీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉండాలి. అయితే, దురదృష్ట వశాత్తు ప్రస్తుత హెచ్1బి వీసా కార్యక్రమంలో అది ప్రతిఫలించడంలేదు. అమెరికన్ వర్కర్ల రక్షణకోసం ఈ బిల్లును ప్రతిపాదించిన ఇస్సాకు కృతజ్ఞతలు. ప్రతినిధుల సభ దీనికి అనుగుణంగా ఓటు వేయాలి’ అని జ్యుడిషియరీ కమిటీ ఛైర్మన్ బాబ్ గుడ్ లేట్ పేర్కొన్నారు. ఇండియా ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఈ పరిణామంతో సంబంధం లేకుండా… గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ వీక్ కోసం ఇండియా వస్తున్న ఇవాంకా ట్రంప్ కు ప్రధాని మోదీ ముందస్తు స్వాగతం పలికారు. ‘మీకు స్వాగతం పలకడానికి మేము ఎదురు చూస్తున్నాం ఇవాంకా ట్రంప్.. ఇండియా, అమెరికా మధ్య సన్నిహిత ఆర్థిక సంబంధాలు మన ప్రజలకు… ముఖ్యంగా వినూత్న పారిశ్రామికవేత్తలకు ఉపయుక్తం’ అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.

ఫొటో : హౌస్ జ్యుడిషియరీ కమిటీ ఛైర్మన్ బాబ్ గుడ్ లేట్, కాంగ్రెస్ ప్రతినిధి డారెల్ ఇస్సా.

Related posts

Leave a Comment