హోదా నిరాకరణ ఎందుకు? కేంద్రాన్ని ప్రశ్నించిన ఏపీ అసెంబ్లీ

admin
6 0
Read Time:8 Minute, 52 Second
చట్టబద్ధమైన అంశాలపై హేళనగా మాట్లాడతారా…
విభజన చట్టం, పార్లమెంటు హామీల అమలు విషయంలో
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఖండన, శాసన సభలో తీర్మానం

ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు నిరాకరిస్తున్నారని రాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హోదా సహా రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని హామీలనూ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రాన్ని ఆక్షేపిస్తూ, నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ చేసిన ఈ తాజా తీర్మానం గతంలో ప్రవేశపెట్టిన పత్రాలకు భిన్నంగా ఉంది. చట్టబద్ధంగా దక్కవలసిన అంశాలపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు అవహేళన చేేస్తూ మాట్లాడిన తీరును అసెంబ్లీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

తీర్మానం పూర్తి పాఠం ఇది

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్ర శాసనసభ తీవ్ర అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ఆస్తుల అప్పుల విభజనలో, విద్యుత్ పంపిణీలో, పన్నుల వసూళ్ళు, తిరిగి చెల్లింపుల్లో మన రాష్ట్రానికి మిక్కిలి నష్టం జరిగింది.

 

విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్ధిక సాయం చేయాలి;

రాష్ట్రానికి రైల్వే జోన్ రావాలి;

ఉక్కు కర్మాగారం స్థాపించాలి;

ఓడ రేవు రావాలి;

పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటుకావాలి;

నియోజకవర్గాల సంఖ్య పెరగాలి;

అనేక విద్యా, పరిశోధన సంస్థలు ప్రారంభించాలి;

ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తికావాలి;

 

విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదింప చేయడానికి ఆనాటి ప్రధానమంత్రి ఆరు హామీలతో కూడిన ప్రకటన చేశారు. అందులో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, ఆదాయం కోల్పోతున్న రాష్ట్రానికి రెవెన్యూ లోటును భర్తీ చేయడం, బుందేల్‌ఖండ్, కోరాపుట్-బోలాంగిర్-కలహండి తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని అందించడం.

 

రైల్వేజోన్ ఇవ్వడం కుదరదంటున్నారు. ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటున్నారు. ఓడ రేవుకు అభ్యంతరాలు పెడుతూ తాత్సారం చేస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వయబిలిటీ గేప్ ఫండింగ్ భారం రాష్ట్రం భరించాలంటున్నారు. విద్యా సంస్థల పురోగతి మందంగా ఉంది. ఇప్పుడు ఇస్తున్న కేటాయింపులను చూస్తే ఇవి వచ్చే ఇరవై యేళ్ళకైనా పూర్తవుతాయా అన్న సందేహం కలుగుతుంది.

 

ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన నత్తనడక నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ఊసే లేదు. విజయవాడ, గుంటూరు పట్టణాలకు డ్రైనేజీ కోసం ఇచ్చిన డబ్బు కూడా రాజధాని అమరావతికి ఇచ్చినట్లు చూపిస్తున్నారు. యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న సాయం నామమాత్రంగా ఉంది.

 

రాష్ట్రం పట్ల కేంద్రం అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణిని శాసనసభ తీవ్రంగా ఖండిస్తోంది. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. మన ప్రజల చిరకాల స్వప్నం. ఏడు ముంపు మండలాలను మనకు బదలాయించిన తర్వాత కేంద్రం నుంచి అందాల్సిన సాయం మందగించడం దురదృష్టకరమని శాసనసభ భావిస్తోంది. మనం ఖర్చు చేసిన సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం కేంద్రం నుంచి ఇంకా రావాల్సి ఉంది.

 

పదునాల్గవ ఆర్ధిక సంఘం సిఫార్సుల దరిమిలా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇప్పుడు హోదా కలిగి ఉన్న రాష్ట్రాలకు కూడా కొనసాగించబోమనీ కేంద్రం చెప్పింది. హోదా బదులు దానికి సరిసమానమైన ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక సహాయాన్ని ఇస్తామన్నారు. అయితే ఈ ప్రత్యేక సహాయం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెద్దగా రాకపోగా, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు పన్ను రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు కొనసాగిస్తున్నారు. పదునాల్గవ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఎక్కడా చెప్పలేదనీ, అది తమ పరిధిలోని అంశం కాదనీ ఆ సంఘం అధ్యక్షులు, సభ్యులు బహిరంగంగా చెప్పారు.

 

ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆర్ధికసంఘం చెప్పనప్పుడు, రాయితీలు ప్రోత్సాహకాలు ప్రస్తుత హోదా రాష్ట్రాలకు కొనసాగిస్తున్నపుడు మన రాష్ట్రానికి ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్రాన్ని ఈ శాసనసభ ప్రశ్నిస్తోంది. చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలు అసంపూర్తిగా, ఆలస్యంగా జరగడం పట్ల రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉంది.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పదేపదే తీసుకువెళ్లినా కేంద్రం ఉదాసీనత ప్రదర్శించింది. రాష్ట్రానికి చట్టపరంగా దక్కాల్సిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వంలోని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు హేళనగా మాట్లాడడాన్ని ఈ శాసనసభ తీవ్రంగా పరిగణిస్తోంది.

 

కేంద్రానికి రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా, అన్యాయంగా విభజన జరిగి కష్టాలలో ఉన్న మన రాష్ట్రం పట్ల ఆ బాధ్యత మరింత ఎక్కువ. మనం నిలదొక్కుకుని, దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేంత వరకు కేంద్రం చేయూత అందించాలి. చట్టంలో లేనివీ, పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలలో లేనివీ మనం అడగడం లేదు. మనవి చట్టబద్ధమైన డిమాండ్లనీ, న్యాయమైన కోరికలనీ కేంద్రం గుర్తించి వ్యవహరించాలని కోరుతూ శాసనసభ తీర్మానిస్తున్నది.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Next Post

హోదాకోసం ఆమ’రణం‘... పవన్ ప్రకటన

Share Tweet LinkedIn Pinterest
error

Enjoy this blog? Please spread the word