హోదా ప్రకటించకపోతే ఏప్రిల్ 6న ఎంపీల రాజీనామా : జగన్ ప్రకటన

మార్చి 5నుంచి పార్లమెంటులో పోరాటం
హోదా రాకపోతే వాళ్ళ మొఖాన రాజీనామా పత్రాలు
నెల్లూరు యాత్రలో వైసీపీ అధినేత జగన్ ప్రకటన

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే ఏప్రిల్ 6వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటగిరి హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోతే తమ పార్టీ లోక్ సభ సభ్యులు రాజీనామా చేస్తారని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మార్చి 5వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో తొలి రోజునుంచీ తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడతారని జగన్ చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న జగన్ మంగళవారం నెల్లూరు జిల్లా కలిగిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీనియారిటీ ప్రత్యేక హోదాను అమ్మేందుకు పనికొచ్చిందని జగన్ ధ్వజమెత్తారు. ప్రత్యేక ప్యాకేజీకంటే హోదాతో వచ్చే ప్రయోజనమేమిటని చంద్రబాబు గతంలో ప్రశ్నించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి అని, తన ఊపిరి ఉన్నంతవరకు దానికోసం పోరాడతానని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసీపీ శ్రేణులు మార్చి 1వ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టనున్నట్టు జగన్ చెప్పారు. మార్చి 3వ తేదీన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా తన పాదయాత్ర ప్రదేశానికి వస్తారని, అక్కడినుంచి జెండా ఊపి తాను ఎంపీలను ఢిల్లీకి సాగనంపుతానని పేర్కొన్నారు.

‘‘మార్చి 5వ తేదీనుంచి మన పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాటాన్ని కొనసాగిస్తారు. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు జరుగుతాయి. ఈ నెలంతా మన ఎంపీలు పోరాడతారు. చివరి రోజు వరకు పోరాడినా హోదా రాకపోతే ఏప్రిల్ 6వ తేదీనే ఎంపీలంతా లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. రాజీనామాలు వాళ్ళ మొఖాన కొడతారు’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

Related posts

Leave a Comment