దశ రూపాల్లో అమరావతి ఆవాసాలు… విదేశీ పర్యటన తర్వాత కన్సల్టెంట్లతో సిఎం భేటీ

3 0
Read Time:9 Minute, 59 Second
  • సవరించిన అంచనాల ప్రకారం వ్యయం రూ. 2,652 కోట్లు..

  • ఆరు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలన్నది కండిషన్..

  • ఎన్‌సీసీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్అండ్‌టీలకు బాధ్యత

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్న అన్ని కన్సల్టెన్సీ సంస్థలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని నిర్మాణం కీలక దశకు చేరుకుంటున్నందున పురోగతి ఎలా సాగుతోందో, ఏ దశలో ఉన్నామో పునరావలోకనం చేసుకోవడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) కార్యకలాపాలను ముఖ్యమంత్రి సమీక్షించారు.

అమరావతి పరిపాలన నగరంలో శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన గృహ సముదాయాలు, మంత్రుల బంగ్లాల ప్రాథమిక ఆకృతులు, నిర్మాణశైలిని ముఖ్యమంత్రి మధ్యాహ్నం సీఆర్‌డీఏ సమావేశంలో పరిశీలించారు. 10 రకాల నిర్మాణశైలితో టీమ్ వన్ ఇండియా సంస్థ ఈ ఆకృతులను రూపొందించింది. వీటి బాహ్య ఆకృతులపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేస్తూ, ఒక్కొక్క బ్లాకుకు ఒక్కొక్క నిర్మాణశైలిని ఉపయోగించుకునేలా తుది ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.
అమరావతిలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, భూ సమీకరణ విధానంలో తిరిగి రైతులకు అందించిన స్థలాలలో వసతుల కల్పన, బాహ్య, అంతర్ వలయ రహదారుల నిర్మాణంలో పురోగతి తదితర అంశాలపై తనకు రానున్న సమావేశంలో సమగ్ర వివరాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
వీఐపీ టవర్లు 18
సీఆర్డీయే ప్రణాళిక ప్రకారం.. శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం మొత్తం 18 టవర్లుగా అపార్టుమెంట్లను నిర్మించనున్నారు. వీటికి అనుబంధంగా క్లబ్ హౌస్, పార్కింగ్ ప్రదేశాలు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాటు నిర్మాణ విస్తీర్ణం 3,500 చదరపు అడుగులుగా నిర్ణయించారు. గెటిటెడ్ అధికారుల్లో టైప్1 వారికి ఒక్కొక్క ఫ్లాటు 1800 చ.గ. విస్తీర్ణంతో 8 టవర్లు నిర్మిస్తున్నారు. టైప్ 2 గెజిటెడ్ అధికారుల నివాసాల కోసం 1500 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో మొత్తం 7 టవర్లు నిర్మిస్తారు.
నాన్-గెజిటెడ్ అధికారుల కోసం ఒక్కొక్క ఫ్లాటు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంతో మొత్తం 22 టవర్లు నిర్మిస్తారు. క్లాస్ ఫోర్ ఉద్యోగుల కోసం ఒక్కొక్క ఫ్లాటు 900 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో 6 టవర్లు నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్టును రానున్న ఆరు మాసాల వ్యవధిలో పూర్తిచేయాలన్న నిబంధనతో ఎన్‌సీసీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్అండ్‌టీ నిర్మాణ సంస్థలను ఎంపికచేశారు. వీటికి సంబంధించి రూ. 2,652 కోట్ల రివైజ్డ్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదించారు.
32 ఎకరాలలో మంత్రుల బంగ్లాలు, 5.3 ఎకరాలలో అఖిలభారత సర్విస్ అధికారుల ఆవాసాలు, 10.3 ఎకరాల విస్తీర్ణంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల అపార్టుమెంట్లు, మొత్తం 23.93 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌వోడీ భవన సముదాయాలు, 5 ఎకరాలలో టైప్ వన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, 7.14 ఎకరాలలో గ్రూపు డీ (క్లాస్ 4) ఉద్యోగుల ఆవాసాలు, 4.9 ఎకరాల విస్తీర్ణంలో టైప్ 2 గెజిటెడ్ అధికారుల ఇళ్లు నిర్మిస్తారు.
వచ్చే నెలలో ఏపీ, సింగపూర్ ముఖ్యుల భేటీ
అమరావతి నగర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ద్వారా తాము మరింత నేర్చుకోగలుగుతున్నామని సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఛాంగ్ చెప్పారు. బుధవారం జరిగిన సీఆర్‌డీఏ 12 వ ప్రాధికార సమావేశంలో ఆయన తన బృందంతో పాల్గొని ముఖ్యమంత్రితో పలు అంశాలపై చర్చించారు. రాజధాని పనుల సంయుక్త అమలు సాధికార కమిటీ (జేఐసీసీ) ఇరు ప్రభుత్వాల ముఖ్యులతో వచ్చే నెలలో నిర్వహించాల్సి వుందని ఆయన ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించారు. అమరావతిలో ప్రాథమికంగా జరిగిన అభివృద్ధిని ఆయన ప్రశంసించారు.
రాజధాని ప్రాంతంలో ప్రీకాస్ట్ విధానంలో చేపట్టిన గృహ నిర్మాణాలకు సంబంధించి సీఆర్‌డీఏ, ఏడీసీ ఇంజనీర్లకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్సిస్ ఛాంగ్ నేతృత్వంలో ఒక బృందం ఇక్కడికి వచ్చింది. రాజధాని పరిధిలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయని సింగపూర్ కన్సార్టియం ముఖ్య కార్యనిర్వహణాధికారి బెంజమిన్ యాప్ సంతృప్తి వ్యక్తం చేశారు. సింగపూర్ ఒకనాడు అనుభవించిన దశను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వారితో అన్నారు.
కష్టాలలో ఉన్న రాష్ట్రానికి అవసరమైన సమయంలో సింగపూర్ ఎంతో సహకరించిందని సిఎం చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం బృహత్ ప్రణాళికను ఉచితంగా అందించడం సింగపూర్, ఏపీ మధ్య ఉన్న సౌహార్థ్ర సంబంధాలకు తార్కాణమన్నారు. స్థిరత్వం, సంతృప్తి, ప్రగతిశీల మానవ వనరుల కోసం ఒకప్పుడు సింగపూర్ చేసిన తరహాలోనే ఏపీ ఇప్పుడు తీవ్ర కృషి జరుపుతున్నట్టు తెలిపారు.
8 విద్యా సంస్థలకు 32 ఎకరాలు
అమరావతిలో విద్యాలయాలను నెలకొల్పడానికి ఆసక్తి కనబరచిన 11 ప్రముఖ సంస్థలలో 8 సంస్థలు పూర్తిస్థాయిలో సంసిద్ధతను వ్యక్తంచేసినట్టు సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. వీరికి మొత్తం 32 ఎకరాల మేర భూములను ఇవ్వడానికి ఈ సమావేశం ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్రస్థాయి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటుకు రాజధానిలో రెండెకరాల స్థలాన్ని ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయడానికి 70 ఎకరాల భూమిని అందించడానికి సీఆర్డీయే సమావేశం ఆమోదం తెలిపింది.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %