899 ప్రశ్నలకు సమాధానాల్లేవు…

2 0
Read Time:8 Minute, 7 Second
పెద్దల సభపై మరీ చిన్నచూపు

శాసనసభ, మండలిలో లేవనెత్తిన అంశాలపై…
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి
రేపటినుంచి మరోసారి శీతాకాల సమావేశాలు

రాష్ట్రం మొత్తీంమీద ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ 175 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో, 58 మంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో అనేక అంశాలు లేవనెత్తుతారు. ప్రశ్నలు వేస్తారు. వాటికి ప్రభుత్వ పక్షం సమాధానాలు చెబుతుంది. పరిష్కారాలను ప్రకటిస్తుంది. ప్రభుత్వం తరఫున వివిధ శాఖల అధికారులు ఈ సమాధానాలను రూపొందిస్తారు. అయితే, ఆచరణలో ఈ విషయమై అధికార వర్గాల్లో కాస్త నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది.

గతంలో వివిధ సందర్భాల్లో జరిగిన శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించి 899 ప్రశ్నలకు సమాధానాలు ఇంకా అందలేదు. అందులో మూడింట రెండు వంతులు శాసన మండలిలో అడిగిన ప్రశ్నలు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాలకు సంబంధించి 545 ప్రశ్నలు, ప్రత్యేక ప్రశ్నలు మరో 58 ఇంకా సమాధానాలకు నోచుకోలేదు. శాసనసభలో సభ్యులు అడిగిన 296 ప్రశ్నల పరిస్థితీ ఇంతే. శాఖలవారీగా చూసినప్పుడు నీటిపారుదల, పరిశ్రమల శాఖలకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు పెండింగ్ లో ఉంటున్నాయి.

సంఖ్య తక్కువ ఉండే మండలికి సంబంధించి ఎక్కువ సమాధానాలు పెండింగ్ లో ఉండటం గమనార్హం. నామినేటెడ్ సభ్యులతో కలిపి మండలిలో ఉండే మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 58. వారు అడిగిన ప్రశ్నల్లో సమాధానాలు ఇంకా రానివి 603. అంటే… సగటున ఒక్కో సభ్యుడికి 10.4 ప్రశ్నలు పెండింగ్ లో ఉన్నాయన్న మాట. ఈ సంఖ్య అధికారుల అసాధారణ నిర్లక్ష్యాన్ని చాటుతోంది.

శాసనసభ పట్ల ఆ స్థాయి నిర్లక్ష్యం కనిపించదు. కాస్త భయం ఉంటుంది. శాసనసభలో సభ్యుల సంఖ్య 175 కాగా పెండింగ్ లో ఉన్న సమాధానాలు 296. అంటే పెండింగ్ ప్రశ్నలు సగటున 1.7గా ఉన్నాయి. శాసన మండలికీ, శాసనసభకూ అధికారుల స్పందనలో ఎంతో తేడా? పెద్దల సభను అధికార గణం మరీ తేలిగ్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ప్రొటోకాల్ విషయంలోనూ నిర్లక్ష్యమే

మండలి సభ్యులకు సమాధానాలు, సమాచారం ఇవ్వడంలోనే కాదు… ప్రొటోకాల్ పాటించే విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై అనేక మంది ఎమ్మెల్సీలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీనుంచి ఉభయ సభల శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం వెలగపూడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి.

స్పీకర్ కోడెల శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు రాని సమాధానాలపై మాట్లాడితే.. మండలి ఇన్చార్జి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పెండింగ్ ప్రశ్నలతోపాటు ప్రొటోకాల్ అంశాన్నీ లేవనెత్తారు. జిల్లాల్లో సభ్యులకు ప్రొటోకాల్ పాటించడంలేదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు.

10 నుంచి 15 రోజులు సమావేశాలు

శాసనసభ సమావేశాలు 10 నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. శాసనసభ వర్షాకాల, శీతాకాల సమావేశాలు రెండూ కలిపి నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత ఎన్ని రోజులు సభ నిర్వహించేది తెలియజేస్తానని స్పీకర్ చెప్పారు. సమావేశాలు 10వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాసన మండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు.

శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వివరాలు సిద్ధం చేయాలని స్పీకర్ కోడెల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులను కోరారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు, అడిగిన సమాచారం ఇవ్వడానికి ప్రతి శాఖలో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తే, వారు సకాలంలో పంపడానికి అవకాశం ఉంటుందని  సలహా ఇచ్చారు. ఈ సారి సభకు సకాలంలో సమాధానాలు అందజేయాలని సూచించారు.

ప్రతిపక్ష సభ్యులకు కోడెల హితవు

సభలో బిల్లులు ప్రవేశపెట్టే విషయం అప్పటికప్పుడు కాకుండా ముందుగా తెలియజేయాలని కార్యదర్శులకు సూచించారు.  ప్రతిపక్ష సభ్యులు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పేపర్లలో చూశానని, అయితే వారు కూడా సభలో పాల్గొని అన్ని అంశాలు చర్చిస్తే బాగుంటుందని, వారిని కూడా సభకు రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని డాక్టర్ కోడెల చెప్పారు.

ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్…

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించి, శాసనసభ వ్యవహారాలకు సహకరించాలన్నారు. సాధారణంగా నీటిపారుదల, పంచాయతీరాజ్ వంటి శాఖలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కవగా ఉంటాయని, ఆ సమాచారం సకాలంలో అందించమని ఆదేశించారు. పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలను, సమాధానాలను వెంటనే వెబ్ సైట్ లో పెట్టే విషయం గుర్తు చేశారు. శాసనసభకు కావలసిన సమాచారం అందించడానికి ప్రతి శాఖలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.

సమావేశంలో ఉన్నతాధికారులు అనిల్ చంద్ర పునేఠా, జెఎస్వీ ప్రసాద్, మన్మోహన్ సింగ్, బి.రాజశేఖర్, ఏఆర్ అనురాధ, జి.అనంతరాము, ఆర్పీ. సిసోడియా, కెఎస్ జవహర్ రెడ్డి, కెవివి సత్యనారాయణ, పీవీ చలపతి రావు, హేమా మునివెంకటప్ప, విజయకుమార్, శ్రీకాంత్ నాగులాపల్లి, శశిభూషణ్ కుమార్, డి.వెంకటరమణ, ఐఎస్ఎస్ నరేష్, టీఎస్ శ్రీధర్, వి.రామయ్య, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ వెంకటేశ్వర్, శాసనసభ ఇన్ చార్జి కార్యదర్శి ఎం.విజయరాజు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply