చదువుకోసం చలో అమెరికా…

5 0

ఉన్నత విద్యకోసం పరుగెడుతున్న ఇండియన్లు

2016-17లో మన దేశం నుంచి 12.3 శాతం వృద్ధి 

విదేశీ విద్యార్ధుల్లో సగం ఇండియా, చైనాల నుంచే..

అమెరికానుంచి ఆసియా వచ్చేది మాత్రం చాలా తక్కువ

పై చదువులకోసం అమెరికా వెళ్లే ఇండియన్ విద్యార్ధుల సంఖ్య గత ఏడాది భారీగా పెరిగింది. అమెరికాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఇ) తన వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. ఓపెన్ డోర్స్ పేరిట విడుదల చేసే ఈ వార్షిక నివేదికలో అమెరికా వచ్చే విదేశీ విద్యార్ధులు, అమెరికానుంచి విదేశాలకు వెళ్లి విద్యనభ్యసించే విద్యార్ధుల వివరాలు పొందుపరుస్తారు.

తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ 2017 నివేదిక ప్రకారం 2016-17 విద్యా సంవత్సరం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన ఇండియన్ విద్యార్ధుల సంఖ్య 1,86,267. క్రితం సంవత్సరం (165,918 మంది) కంటే ఈ మొత్తం 12.3 శాతం అధికం. అన్ని దేశాలనుంచి అమెరికా వెళ్లిన విద్యార్ధులలో ఇండియన్లు 17.3 శాతం.

చైనీయుల తర్వాత ఇండియన్లే ఎక్కువగా చదువుకోసం అమెరికా వెళ్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలనుంచి 2016-17లో అమెరికా వెళ్ళిన విద్యార్ధులలో దాదాపు మూడో వంతు (32.5 శాతం) చైనీయులే. చైనా నుంచి ఏకంగా 3,50,755 మంది విద్యార్ధులు చదువుకోసం అమెరికా వెళ్ళారు. అయితే, 2015-16తో పోలిస్తే చైనా విద్యార్ధుల సంఖ్యలో పెరుగుదల 6.8 శాతం మాత్రమే ఉంది.

ఈ రెండు దేశాల తర్వాత దక్షిణ కొరియా నుంచి 58,663 మంది విద్యార్ధులు, సౌదీ అరేబియానుంచి 52,611 మంది, కెనడా నుంచి 27,065 మంది, వియత్నాంనుంచి 22,438 మంది గత ఏడాది అమెరికా వెళ్ళారు. పెరుగుదలలో చూసినప్పుడు నేపాల్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంనుంచి 2015-16లో 9,662 మంది విద్యార్ధులు అమెరికాలో చదివితే 2016-17లో ఈ సంఖ్య 11,607కు (20.1 శాతం) పెరిగింది. పెరుగుదలలోనూ ఇండియా రెండో స్థానంలో ఉంది.త

మొత్తంగా ప్రపంచ దేశాలన్నిటినుంచీ గత ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్ధులు 10,78,822 మంది. 2015-16లో 10,43,839 మంది విదేశీ విద్యార్ధులు అమెరికా వెళ్ళారు. అప్పటిదాకా విదేశీ విద్యార్ధుల సంఖ్యలో వృద్ధి బాగా ఉన్నా 2016-17లో మందగించింది. కేవలం 3.4 శాతం మాత్రమే అదనంగా అమెరికా వెళ్లారు. 2014-15 సంవత్సరంలో ఏకంగా 10 శాతం అదనంగా విదేశీ విద్యార్ధులు అమెరికా వెళ్ళారు.

మొత్తంగా చూసినప్పుడు అమెరికాలో విదేశీ విద్యార్ధుల సంఖ్య, అమెరికాలోని మొత్తం విద్యార్ధులలో విదేశీయుల వాటా క్రమంగా పెరుగుతున్నాయి. 2006-07లో అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన మొత్తం విద్యార్ధులలో 3.3 శాతం విదేశీయులు. 2016-17లో ఈ మొత్తం 5.3 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధానంగా చైనీయుల సంఖ్య గణనీయంగా పెరగడమే కారణం.

ఇండియాను అధిగమించిన చైనా

2009 వరకు అమెరికా వెళ్ళే విదేశీ విద్యాార్ధులలో ఇండియన్లదే మొదటి స్థానం. 2010 నుంచి పరిస్థితి మారింది. ఇండియన్ల సంఖ్యను చైనీయులు అధిగమించారు. గత ఎనిమిదేళ్లలో చైనా విద్యార్ధుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు ఇండియన్ విద్యార్ధులకు దాదాపు రెట్టింపు స్థాయిలో చైనీయులు వెళ్తున్నారు. అమెరికాలోని విదేశీ విద్యార్ధుల్లో సగం ఈ రెండు దేశాలనుంచే ఉండటం గమనార్హం.

ఇండియాలో అమెరికన్ స్టూడెంట్స్ తగ్గారు

అమెరికా వెళ్ళిన ఇండియన్ విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగినా.. అంటు నుంచి ఇటు వచ్చినవారి సంఖ్య మాత్రం తగ్గింది. అమెరికానుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్ధుల పరిశీలనకు 2015-16 సంవత్సరం డేటాను వెల్లడించారు. సాధారణంగానే ఇక్కడినుంచి అమెరికా వెళ్లే విద్యార్ధులతో పోలిస్తే అక్కడినుంచి ఇండియా వచ్చి చదువుకునేవారి సంఖ్య చాలా తక్కువ. అందులోనూ 2015-16లో 5.8 శాతం తగ్గి 4,181 మందికి పరిమితమయ్యారు. అమెరికానుంచి ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్లి చదువుకుంటున్నవారి సంఖ్య గత ఏడాది 3,25,339గా ఉంది. అందులో ఇండియా వచ్చినవారు కేవలం 1.3 శాతం.

అమెరికన్లకు యూరప్ మోజు!

ఆసియన్లు అధికంగా అమెరికా వెళ్లి చదువుకుంటుంటే అమెరికన్లు మాత్రం అధికంగా యూరప్ దేశాలకు వెళ్తున్నారు. 2015-16 సంవత్సరంలో అన్ని దేశాలకు వెళ్లి చదువుకున్న మొత్తం అమెరికన్ విద్యార్ధులలో యూరోపియన్ దేశాల వాటా 54.4 శాతంగా ఉంది. మొత్తం ఆసియా దేశాలకు వచ్చిన అమెరికన్ విద్యార్ధులు 11.1 శాతమే. అందులో చైనాకు 3.6 శాతం, జపాన్ దేశానికి 2.2 శాతం, దక్షిణ కొరియాకు 1.8 శాతం వచ్చారు. యూరోపియన్ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్ 12 శాతం అమెరికన్ విద్యార్ధులను ఆకర్షించి ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. తర్వాత ఇటలీ (10.7 శాతం), స్పెయిన్ (92 శాతం) నిలిచాయి.

తెల్ల జాతీయులే అధికం

విదేశాాలకు వెళ్ళి చదువుకునే అమెరికన్లలో 71.6 శాతం తెల్ల జాతీయులే. లాటిన్ అమెరికన్లు 9.7 శాతం. ఆసియా లేదా పసిఫిక్ దీవుల నేపథ్యంగలవారు 8.4 శాతం కాగా నల్లజాతీయులు కవేలం 5.9 శాతం. ఇక ఒరిజినల్ గా అమెరికా గడ్డపైన పుట్టిన రెడ్ ఇండియన్లు, అలాస్కా జాతీయులు కేవలం 0.5 శాతం ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల్లో అంతరాల కారనంగా తెల్ల జాతీయులు విదేశీ విద్యకు వెళ్ళగలుగుతున్నారు. అయితే, ఏటేటా నెమ్మదిగానైనా తెల్ల జాతీయుల వాటా తగ్గుతోంది. 2005-06లో విదేశాలకు వెళ్ళి చదువుకున్న అమెరికన్ విద్యార్ధులలో 83 శాతం తెల్ల జాతీయులే. 2015-16కు వచ్చేసరికి వారి వాటా 71.6 శాతానికి తగ్గింది.