126 మందితో టీడీపీ తొలి జాబితా

5 0
Read Time:5 Minute, 5 Second

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకోసం అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ సహా మొత్తం 126 మంది అభ్యర్ధులకు చోటు దక్కింది. గురువారంనాడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశంలో జాబితాకు ఆమోదం పొందిన అనంతరం రాత్రి పొద్దుపోయాక మీడియాకు వెల్లడించారు.

తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్న లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిని ఎంచుకున్నారు. చంద్రబాబు వరుసగా ఏడోసారి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంనుంచి పోటీ చేస్తుండగా, ఆయన వియ్యంకుడు నందమూరి బాలక్రిష్ణ మరోసారి అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత సీటు పులివెందుల నుంచి మరోసారి సింగారెడ్డి వెంకట సతీష్ రెడ్డిని బరిలోకి దించారు.

ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న కె.ఇ. క్రిష్ణమూర్తి, పరిటాల సునీతల స్థానంలో వారి కుమారులకు సీట్లు కేటాయించారు. ఆదినారాయణరెడ్డిని కడప లోక్ సభ స్థానంనుంచి బరిలోకి దించుతున్న నేపథ్యంలో ఆయన పేరు ఈ జాబితాలో లేదు. ప్రకాశం జిల్లా మంత్రి సిద్ధా రాఘవరావును లోక్ సభ ఎన్నికల బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా జాబితాలో చోటు లభించలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా ఉన్న ఫరూక్ కు నియోజకవర్గం కేటాయించలేదు. అనంతపురం జిల్లా మంత్రి కాలువ శ్రీనివాసులు పేరు తొలి జాబితాలో రాలేదు.

మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి కాకుండా ఈసారి విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. మరో మంత్రి జవహర్ కు పొరుగు జిల్లాలోని తిరువూరు సీటు కేటాయించారు. ఇంతకు ముందు నియోజకవర్గం లేని మంత్రి పొంగూరు నారాయణకు నెల్లూరు సిటీ సెగ్మెంట్ కేటాయించారు. నెల్లూరు రూరల్ నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించారు.

ఇటీవల పార్టీ మారిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమోహన్ పై పోటీకి సీనియర్ నేత కరణం బలరాంను దించారు. టీడీపీ నుంచి వెళ్లిపోతారని ప్రచారం జరిగిన తోట త్రిమూర్తులుకు మళ్లీ రామచంద్రాపురం సీటును కేటాయించారు. కొత్తగా వచ్చినవారిలో కోట్ల సుజాతమ్మకు ఆలూరు, గౌరు చరితారెడ్డికి పాణ్యం సీట్లు కేటాయించారు. మంత్రి అఖిలప్రియకు ఆళ్ళగడ్డ కేటాయించి ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి సీటు నంద్యాల పెండింగ్ లో పెట్టారు.

రాజధాని అమరావతి పరిధిలో అధిక భాగం ఉన్న తాడికొండ నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు తిరిగి ఆ సీటు కేటాయించలేదు. ఆ స్థానానికి అభ్యర్ధిగా బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రిని ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ కుమారుడు, తెలుగు యువత ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ ను గుడివాడ నుంచి బరిలోకి దించారు. ఎమ్మెల్యే వంగలపూడి అనితను ఉత్తరాంధ్ర నుంచి మార్చి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కేటాయించారు.

కొద్దిపాటి మార్పులతో మెజారిటీ సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారు చంద్రబాబు. తాను అనేక సర్వేలు చేయించానని, ఒక ఎమ్మెల్యే పట్ల ఏకంగా 87 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %