కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈ నెల 28వ తేదీకి 132 సంవత్సరాలు. 1985లో స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి అప్పటినుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినవారిలో 60వ వ్యక్తి రాహుల్ గాంధీ. నెహ్రూ – గాంధీ కుటుంబంనుంచి ఐదో తరంలో ఆరో వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించబోతున్నారు. ఎంపీగా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన 13 సంవత్సరాల తర్వాత… ఉపాధ్యక్షుడిగా నాలుగేళ్ళు పని చేశాక రాహుల్ గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను స్వీకరించారు. శనివారం ఢిల్లీలో సాదాసీదాగా జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పట్టాభిషేకం పూర్తయింది. గత 19 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన తన తల్లి సోనియా గాంధీనుంచి రాహుల్ గాంధీ కొత్త బాధ్యతలను స్వీకరించారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 47 సంవత్సరాల రాహుల్ గాంధీ గత దశాబ్ద కాలంలో ‘స్లో లెర్నర్’ అన్న ఆక్షేపణను ఎదుర్కొన్నారు. 2014లో ఓటమి తర్వాత పరిణామాల్లో పరిణతి చెందారని ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో నమ్మకం కుదిరింది. సోనియాగాంధీ సారథ్య బాధ్యతలు స్వీకరించేనాటికి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ దాదాపు అలాగే ఉందని భావిస్తున్న నేతలు… రాహుల్ సారథ్యం తిరిగి తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాహుల్ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్…రాహుల్ సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
దేశంలో ఆశావహ రాజకీయాలపైన భయానక వాతావరణాన్ని కల్పించే రాజకీయాలు పైచేయి సాధించాయని, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తున్నారని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గత కొన్ని సంవత్సరాల్లో దేశమంతా తిరిగారని, పరిస్థితులు ఆయనకు తెలుసని, ఇప్పుడిక ఎవరూ చెప్పవలసిన అవసరంలేదని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించిన సోనియా ‘‘రాహుల్ రాకతో పార్టీలో కొత్త జోష్ మొదలైంది’’ అని వ్యాఖ్యానించారు. తనకు ఇంత కాలం సహకరించినందుకు అందరికీ సోనియా ధన్యవాదాలు తెలిపారు.
‘‘13 ఏళ్ళుగా మీ అందరినీ చూస్తూ నేర్చుకున్నా. ప్రతి భారతీయుడి గొంతుగా మారతా’’ అని రాహుల్ గాంధీ బాధ్యతలను స్వీకరించాక కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చెప్పారు.