కంజీరకు మరక… లైంగిక వేధింపులు కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్టు

తాను ఆలపించే ‘గజల్స్’నే ఇంటిపేరుగా చేసుకున్న శ్రీనివాస్‌ ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో మంగళవారం అరెస్టయ్యారు. ఆలయ పరిరక్షణకోసం ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంస్థ కార్యాలయాన్నే తన రాసలీలలకు కేంద్రంగా చేసుకున్నారని ఓ మహిళ ఆధారసహితంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గజల్ శ్రీనివాస్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు హైదరాబాద్ పోలీసులు. శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు 10 రోజుల పాటు రిమాండ్ విధించింది.

ఆలయ పరిరక్షణ ప్రచారం కోసమంటూ ఏర్పాటు చేసిన ఆలయవాణి వెబ్ రేడియో కార్యాలయంలోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గజల్ శ్రీనివాస్‌పై అభియోగం. గత నెల 29వ తేదీన బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు, పక్కాగా సాక్ష్యాలు సేకరించిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ యువతి సేవ్ టెంపుల్ అనే సంస్థ పేరిట నిర్వహిస్తున్న ఆలయవాణి రేడియోలో గత ఏడాది మధ్యలో ఉద్యోగంలో చేరింది. తర్వాత ఆమే హెడ్ అయింది. సంస్థ యజమానులు ఆమెరికాలో ఉంటుండగా ప్రచారకర్తగా గజల్ శ్రీనివాస్ ఇక్కడి వ్యవహారాలు చూస్తున్నారు.

తెలుగులో గజల్స్ అంటే టక్కున గుర్తొచ్చే ఒకే పేరు శ్రీనివాస్. అంతలా పేరు సంపాదించుకున్న ఈ గాయకుడు… తనకు ఏ స్థాయిలో పలుకుబడి ఉందో చెప్పి మరీ మహిళలను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపణలు రావడం, అరెస్టు కావడం సంచలనమైంది. మసాజ్ చేయాలంటూ మొదలుపెట్టి లైంగిక వాంఛలు తీర్చాలనే వరకు తనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్టు బాధిత యువతి చెప్పారు. తన ముందు బట్టలు విప్పి గంతులేసినట్టు కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను లొంగకపోవడంతో బెదిరించాడని, తాను చెప్పినట్టు చేస్తే ఆర్థికంగా ఆదుకుంటానని, మంచి పొజిషన్‌లోకి తెస్తానని ఆశ చూపాడని ఆమె చెబుతున్నారు.

గజల్ శ్రీనివాస్ వద్ద పీఏగా పనిచేసే పార్వతి అనే మహిళ తాను మసాజ్ చేస్తానని, నువ్వు కూడా మసాజ్ చేయాలని ఒత్తిడి తెచ్చిందని బాధిత మహిళ ఆరోపించింది. ఉద్యోగం మానేద్దామనుకుంటే… ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్ ఇవ్వనని బెదిరించాడని ఆమె తెలిపింది. వేధింపులు భరిస్తూ వికృతచేష్టలపై సాక్ష్యాలు సేకరించినట్టు బాధితురాలు చెప్పింది.

ఆమె ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు శ్రీనివాస్ మొదటి నిందితునిగా, అతనికి సహకరించిన పార్వతి రెండో నిందితురాలిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఇటు గజల్ శ్రీనివాస్, అటు పార్వతి ఖండించారు. వారి తరఫున గజల్ శ్రీనివాస్ కుటుంబ స్నేహితులు కూడా రంగంలోకి దిగారు. అయితే, ప్రాథమిక నిర్ధారణ తర్వాతే అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. గజల్ శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 12వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. గజల్ శ్రీనివాస్‌ను విచారించేందుకు 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

Related posts

Leave a Comment