2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. ఆర్నెల్ల తన పాదయాత్రలో 13వ రోజునే భారీ హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో గృహావసరాలకు నెలకు 200 యూనిట్లకంటే తక్కువ వినియోగించేవారందరికీ విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నట్టు జగన్ ప్రకటించారు. వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు కనీస వయసును 45 సంవత్సరాలకు తగ్గిస్తామన్నది జగన్ మరో భారీ హామీ.
వీటితోపాటు డ్వాక్రా సంఘాల మహిళలకు ఎన్నికలనాటికి ఎంత అప్పు ఉన్నా నాలుగు వాయిదాల్లో ఆ మొత్తాన్ని ఇస్తామని, పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా రూ. 15000 ఇస్తామని ప్రకటించారు. ఇంతకు ముందే ఇచ్చిన… పెద్ద చదువుల ఫీజులు భరించడం వంటి హామీలను పునరుద్ఘాటించారు. సోమవారం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం హుస్సేనాపురంలో ‘మహిళలతో ముఖాముఖి’ కార్యక్రమంలో మాట్లాడారు.
తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సాయం, రేషన్, పెన్షన్ వంటి వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ.. ప్రభుత్వ పథకాల అమలుపై విమర్శలు గుప్పించారు జగన్. విద్యుత్ బిల్లులు ఎంత వస్తున్నాయంటూ అడిగి… తాను అధికారంకలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల లోపు వాడేవారందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తానని ప్రకటించారు. దాంతో సెల్ ఫోన్ చార్జింగ్ నుంచి ఇతర అవసరాలన్నీ తీరతాయన్నారు.