విజయవాడలో 20 వేల ఇళ్ళు

కాలువల అనుసంధానం, సమీప గ్రామాల అభివృద్ధి..

విజయవాడలో 20 వేల ఇళ్ళను నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శనివారం విజయవాడలో ఆకస్మిక తనిఖీలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. జక్కంపూడి కాలనీలో అసంపూర్తిగా ఉన్న 4 వేల ఇళ్లను రెండు మూడు నెలల్లో నివాసయోగ్యంగా మలుస్తామన్న సిఎం… మొత్తంగా ఆ ప్రాంతంలో 12 వేల ఇళ్లను ఇక్కడ నిర్మిస్తామన్నారు. జక్కంపూడి కాలనీని ఎకనామిక్ సిటీగా నిర్మించనున్నట్లు చెప్పారు.

 

వాంబే కాలనీ లో 50 ఎకరాలు నిరుపయోగంగా ఉందని, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు చెందిన 30 ఎకరాలు కూడా ఉపయోగించుకుంటే మరో 14 వేల ఇళ్లను నిర్మించగలుగుతామని చంద్రబాబు పేర్కొన్నారు. భవన నిర్మాణ వ్యర్ధాలతో ఉపయోగించుకునే యూనిట్ స్థాపనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్యుపెన్సీ రేటు పెరుగుతోందన్న సిఎం.. నిర్వహణలో ఉత్తమ చికిత్సలు, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజలు ఆరోగ్యం, విద్య కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తోందని, అందువల్ల ప్రభుత్వాసుపత్రులలో సదుపాయాలను పెంచుతున్నామని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ద్వారా హాస్పిటల్ క్లీనింగ్, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ తదితర 12 సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణ చేప్పట్టి నూతన భవనాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని సిఎం వెల్లడించారు. ఆసుపత్రిలో సుందరీకరణ పనులను చేపట్టి ఆహ్లాదంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కాలువల సుందరీకరణ, అనుసంధానం

నగరంలో మూడు కాల్వలు, బుడమేరు డ్రైన్ ఉన్నాయని, వాటిని సుందరీకరించి పారిశుధ్యాన్ని మెరుగుపరచడం ద్వరా అత్యంత స్వచ్ఛమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దవలసి ఉందని సిఎం చెప్పారు. కాలువలను అనుసంధానం చేయడం ద్వారా జల రవాణాను నిర్వహించవచ్చన్నారు. విజయవాడ సుందరీకరణకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

రామవరప్పాడునుంచి గన్నవరం వరకు రోడ్ విస్తరణ పనులు చెప్పటాల్సి వుందని సిఎం పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి విజ్నప్తి చేశారు. పరిశుభ్ర నగరంగా విజయవాడ నగరం రాష్ట్రంలో కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. నగరంలో కాలువలపై మరో రెండు, మూడు వంతెనలు కావాలని ప్రజలు నుంచి విజ్నాపనలు వచ్చాయని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలతో రావాలని అధికారులను సిఎం ఆదేశించారు.

పరిసర గ్రామాలూ అభివృద్ధిలో భాగం

విజయవాడ నగర పరిసర ప్రాంత గ్రామాలను నగర అభివృద్ధిలో భాగం చేస్తామని సిఎం చెప్పారు. ఇందుకోసం ఆ పంచాయతీ ప్రజా ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. ఆర్టీసీ సీఎన్జీ టెర్మినల్ వద్ద సుందరీకరణ చేపట్టి పార్కుగా రూపుదిద్దుతామని, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించానని చంద్రబాబు చెప్పారు.

Related posts

Leave a Comment