వ్యవసాయం నుంచి వాణిజ్యానికి… రాజధాని రైతుల సింగపూర్ టూర్ లక్ష్యం ఇదే!

  • విదేశీ యాత్రకు వెళ్ళే రైతుల సంఖ్య 123కు పెంపు
  • రాజధానితో సమాంతరంగా రైతుల ఉన్నతి
  • 32 వేల కుటుంబాలూ ఆర్థికంగా బలపడాలి
  • వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళిక
  • సీఆర్డీయేకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ఓ కార్యప్రణాళికను వచ్చే సమావేశానికల్లా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్డీయే అధికారులను ఆదేశించారు. వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు123మంది రాజధాని ప్రాంత రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనకు బుధవారం జరిగిన 12వ సీఆర్‌డీఏ ప్రాధికార సమావేశంలో ఆయన ఆమోదం తెలిపారు. సింగపూర్‌లో ఉన్న ఉత్తమ అభ్యాసాలు, అవకాశాలపై అవగాహన పెంచి వ్యాపార, వాణిజ్య రంగాల్లో రైతులను ప్రావీణ్యులను చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యాత్రకు రూపకల్పన చేశామని సిఎం చెప్పారు.

రాజధాని గ్రామాలలో ఉన్న రైతులు అమరావతికి అసలు పౌరులు. వారి ఉన్నతికి దోహదపడే కృషిని తక్షణం చేపట్టాలి

సింగపూర్ తీసుకువెళ్లేందుకు జరిపిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 123 మంది రైతులు అర్హత సాధించగా, లాటరీ తీసి అందులో వందమందిని ఎంపిక చేశామని సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. మిగిలిన ఆ 23 మంది రైతులను నిరుత్సాహ పర్చకుండా వారిని కూడా సింగపూర్ తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు అదనంగా అవసరమయ్యే రూ. 12 లక్షల బడ్జెట్ కేటాయింపు అంశాన్ని సమావేశం ఎజెండాలో చేర్చగా, ముఖ్యమంత్రి దానికి వెంటనే ఆమోదం తెలిపారు.

రాజధాని గ్రామాల్లోని రైతులు కష్టజీవులు. మూడేళ్ల క్రితం వరకు వారంతా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవించారు. నా మాట విని నమ్మి విలువైన భూములను ప్రభుత్వానికి అందించారు. వారంతా సంతోషంగా ఉండేలా చూడాలి. సంతృప్తిగా జీవించాలి. వారందరినీ పారిశ్రామికవేత్తలుగా మార్చాలి. అందుకు గల అన్ని అవకాశాలనూ వారికి అందుబాటులో తీసుకురావాలి

‘ఫార్మర్స్ ఫస్ట్’ అనే భావనతో ఈ యాత్ర తలపెట్టామని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పగా, ‘సాధికారత దిశగా రాజధాని రైతు’ చేపట్టే యాత్రగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. రాజధాని రైతులు వ్యవసాయం నుంచి వాణిజ్య, పారిశ్రామికరంగం వైపు మరలే ప్రక్రియ వీలైనంత వేగంగా, సరళంగా జరిగిపోవాలని చెప్పారు. అమరావతి గ్రామాల్లోని 32 వేల కుటుంబాలు ఆర్థికంగా బలపడేలా, సమున్నతంగా ఎదిగేలా నిర్ణీత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఆర్‌డీఏకు సూచించారు.

రాజధాని అభివృద్ధికి సమాంతరంగా రాజధాని రైతుల అభివృద్ధి కూడా జరగాలి. దీనిపై రానున్న సమావేశంలో నిర్ధిష్ట ప్రతిపాదనలతో రావాలి

రాజధాని గ్రామాల్లోని వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికుల సమగ్ర వివరాలను సేకరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులపై తాజా సమాచారం తీసుకోవాలన్నారు. వారిని చిన్నచిన్న బృందాలుగా ఏర్పరచి నైపుణ్య శిక్షణ, వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుపై సరైన అవగాహన కల్పించాలని, ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకన్జీకి ఈ బాధ్యతలు అప్పగించి తగిన ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.

Share It

Leave a Reply

shares