కార్పొరేట్‌ చదువులపై కమిటీ

విద్యాకుసుమాలు నేలరాలకూడదన్న ముఖ్యమంత్రి

విద్యార్థులపై తీవ్ర వత్తిడి చూపి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేస్తున్న ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానంలో అవసరమైన మార్పులు తీసుకువచ్చేలా తగు సూచనలిచ్చేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూనే విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే విద్యావిధానాలను ప్రవేశపెట్టడానికి ఈ కమిటీ అవసరమైన సూచనలు, సిఫారసులు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు పలువురు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు.

ఇటీవలి విద్యార్థుల ఆత్మహత్యలను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికిగల కారణాలను విశ్లేషించి తగు నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులను పిలిపించి సోమవారం వారితో ప్రత్యేకంగా సమావేశం జరిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.మార్కులు, గ్రేడ్ల కోసం ఆరాటపడుతూ విద్యార్థులలలో మానసిక ప్రశాంతతను దూరం చేసి తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తున్న ‘బట్టీ’ విధానాలను విడనాడాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులను హెచ్చరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సంఖ్యను పెంచి వేలాదిమంది వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకున్నది నేనే, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌ను విద్యా, వైజ్ఞానిక గమస్థానంగా మార్చాలని అనుకుంటున్నాను. అందులోభాగంగానే ప్రపంచశ్రేణి విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకువస్తున్నాను. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వీటన్నింటినీ ఏర్పాటు చేయాలన్నదే నా సంకల్పం. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నంత మాత్రాన కార్పొరేట్ కళాశాలలు తమ ఇష్టానుసారం నడుచుకుంటే ప్రభుత్వం ఊరుకుంటుందని అనుకోవద్దు. మీకు స్వీయ నియంత్రణ ఉండాలి. మీ విధానాలు, పద్దతులు మార్చుకోవాలి. ముఖ్యంగా విద్యార్థుల్ని వేధించే పద్ధతుల్ని తక్షణం వదిలిపెట్టాలి. వారి పట్ల మీ వ్యవహారశైలిలో ఈ క్షణం నుంచే నాకు మార్పులు కనిపించాలి”-ముఖ్యమంత్రి

పరిపాలనలో పారదర్శకత పెంచి ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నామని, ఆ సాంకేతికత తప్పుదారి పడితే ఉత్పాతాలు, ఉపద్రవాలు తప్పవని ముఖ్యమంత్రి చెప్పారు. సాంకేతిక ఉపకరణాలకు మనిషి బానిసగా మారడమే అన్నింటికంటే దౌర్భాగ్యమని అన్నారు. ‘మీరు విద్యార్థుల్ని మరబొమ్మలుగా భావిస్తున్నారు. మనుషులకు, మిషన్లకు తేడా ఉంది. మిషన్ అనేది మనిషి తన సౌలభ్యం కోసం తాను తయారు చేసుకున్న ఇన్నోవేషన్. దాన్ని నడిపించేది కూడా మనిషే. ఆ విషయాన్ని మరచిపోయి మీరు విద్యార్థుల్ని మిషన్‌గా మార్చేస్తున్నారు. అతిగా చేస్తే అనర్ధం తప్పదు. ఆహారం కూడా అతిగా తింటే అనారోగ్యం వస్తుంది. విద్యావిధానం జ్ఞానాన్ని అందించేలా ఉండాలి కానీ, విద్యార్థి తన సృజన కోల్పోయేలా చేయరాదు. ఏదైనా హద్దు మీరితే ప్రమాదం’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని సంతోష సూచికను తీసుకువచ్చామని చెబుతూ, దీనికి విరుద్ధంగా భావిభారత పౌరులను ఆనందానికి దూరం చేసే విధానాలతో వారిలో వత్తిడి పెంచడం భావ్యం కాదని అన్నారు. ఇకనుంచి విద్యార్థుల సామాజిక సేవ (సోషల్ వర్క్)కు 5 శాతం మార్కులు తప్పనిసరి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. ఫిజికల్ లిటరసీ ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు, కళాశాలల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్ని ప్రకృతితో మమేకం చేయడం, జల వనరుల పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛాంధ్ర దిశగా నడిపించడం తప్పనిసరి చేస్తున్నామన్నారు. వీటిని ఒక ప్రాజెక్టుగా తీసుకుని వాటికోసం కృషి చేసే విద్యార్థులను మార్కులిచ్చి ప్రోత్సహిస్తామన్నారు.

కొత్తగా ఏర్పాటుచేస్తున్న కమిటీ ఈ అంశాలను మరింత సమర్ధంగా అమలు చేసేలా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నెలకు ఒకసారి ఈ కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో సమీక్ష చేస్తానని చెప్పారు. సమావేశంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ నండూరి సాంబశివరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, ఉన్నత విద్యా కార్యదర్శి శ్రీమతి ఉదయలక్ష్మి పాల్గొన్నారు.

Share It

Leave a Reply

shares