ఇస్రో వర్ష సమాచారం భేష్..

మరింత సహకారం కావాలని ఇస్రో ఛైర్మన్ కు ముఖ్యమంత్రి లేఖ

వాతావరణ మార్పులపై ఇస్రో ఇస్తున్న సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇస్రోనుంచి మరింతగా సాంకేతిక సహకారం పొందేలా పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగించదలచినట్టు ఆయన తెలిపారు. ఈమేరకు ఇస్రో ఛైర్మన్ కు ముఖ్యమంత్రి ఓ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్రో అందిస్తున్న సేవలను ఆ లేఖలో కొనియాడిన ముఖ్యమంత్రి, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడానికి అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ‘ఇస్రో హెచ్చరికలతోనే డిసెంబర్ 12న వచ్చిన వార్ధా సైక్లోన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నైరుతి రుతుపవన కాలంలో 80 శాతం కచ్చితత్వంతో ఇస్రో అందించిన వర్షపాతం, వరదల సమాచారం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడానికి ఉపకరించింది. మే నెలలో వచ్చిన వడగాల్పుల సమయంలో కూడా ఇస్రో అందించిన ముందస్తు సమాచారం ఎంతగానో ఉపయోగపడింది’ అని సిఎం తెలిపారు.

తాజాగా అక్టోబర్ 8వ తేదీనుంచి 14వరకు రాయలసీమలో కురిసిన వర్షం సమాచారం కూడా ముందస్తు చర్యలు చేపట్టడానికి దోహదం చేసిందని సిఎం గుర్తు చేశారు. తుఫాన్లు, వరదల వంటి విపత్తులను ముందే పసిగట్టి సరైన చర్యలు చేపట్టేందుకు ఇస్రో సేవలు తోడ్పతున్నాయని సిఎం తెలిపారు.

Share It

Leave a Reply

shares