2018 సంవత్సరంలో భారీ భూకంపాల సంఖ్య పెరుగుతుందట. భూ భ్రమణం మందగించిన కారణంగా ప్రతి 32 సంవత్సరాలకోసారి భారీ భూకంపాలలో పెరుగుదల కనిపిస్తోందని, ఆ ఆపన్న సమయం రానే వచ్చిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రిక్టర్ స్కేలుపై 7, అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల సంఖ్య పెరుగుతుందని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2018లో ఇలాంటి భూ కంపాల వల్ల 100 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతం ప్రభావితం అవుతుందని అంచనా.
ఈ ఏడాది ఆగస్టులో ‘జియోలాజికల్ రీసెర్చ్ లెటర్స్’లో ఒక పరిశోధనా పత్రం ప్రచురితమైంది. దాన్ని గత వారం జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా వార్షిక సమావేశంలో ప్రెజెంట్ చేశారు. కొలరాడో యూనివర్శిటీకి చెందిన రాబర్ట్ బిల్హామ్, మోంటానా వర్శిటీకి చెందిన రెబెకా బెండిక్ 1900 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రిక్టర్ స్కేలుపై 7, అంతకు మించి నమోదైన ప్రతి భూ కంపాన్నీ అధ్యయనం చేశారు. వారి పరిశోధనల సారమే తాజా పత్రాలు.
ప్రతి 32 సంవత్సరాలకు ఒకసారి భారీ భూకంపాల్లో పెరుగుదల ఉంటున్నట్టు వారు గుర్తించారు. అదే సమయంలో భూ భ్రమణం మందగించి ఆ తర్వాత మళ్ళీ వేగం పుంజుకుంటోందట. ఇలా భ్రమణంలో హెచ్చుతగ్గులు సంభవించినప్పుడు భూమి పొరల్లో సీస్మిక్ యాక్టివిటీ పెరుగుతోందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. భూభ్రమణంలో మదగమనం అంటే… ఒక రోజులో కేవలం ఒక్క మిల్లీ సెకండ్ మాత్రమే తేడా వస్తుంది. దాని ప్రభావంతోనే భూమి లోపల పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది.
ప్రతి 32 సంవత్సరాలకు భారీ భూకంపాలు సంభవించే ముందు ఐదేళ్ళ కాలంలో భూభ్రమణం మందగిస్తోందని భూభౌతిక శాస్త్రవేత్తలు గమనించారు. ఆ కాలంలో ఏడాదికి 25 నుంచి 30 తీవ్ర భూకంపాలు సంభవిస్తున్నాయని, మిగిలిన సమయాల్లో ఏడాదికి 15 మాత్రమే సంభవిస్తున్నాయని నిపుణులు కనుగొన్నారు. ఇప్పుడు ఆందోళన ఎందుకంటే.. ఈ మందగమన కాలం వచ్చి ఇప్పటికి నాలుగేళ్లయింది. అంటే… ఆపద కాలం ఇంకో ఏడాది లోపే ఉందన్నమాట. భారీ భూకంపాలలో పెరుగుదల త్వరలో చూడబోతున్నామన్నమాట. 2018లో కనీసం 20 భారీ భూకంపాలు చూస్తామనడంలో సందేహం లేదన్నది నిపుణుల మాట. ఇవి 25 నుంచి 30 కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.
భారీ భూ కంపాలు ఎన్ని ఎక్కడ సంభవిస్తాయన్నదాన్నిబట్టి ప్రభావితమయ్యే ప్రజల సంఖ్య ఎంత అన్నది ఆధారపడి ఉంటుంది. దాదాపు 100 కోట్ల జనాభా నివసించే దేశాలు, ప్రాంతాలను వచ్చే ఏఢాది సంభవించే భూకంపాలు ప్రభావితం చేయవచ్చని ఓ వార్త సారాంశం. అయితే, భూ కంపాలను ఎదుర్కొనే శక్తి ఉన్న దేశాలు మరణాలు లేకుండానే జాగ్రత్తలు తీసుకోగలవు. ఉదాహరణకు జపాన్ లో 2011లో అతి భారీ భూకంపం (రిక్టర్ స్కేలుపై 9 తీవ్రత) సంభవించిన సందర్భంలో 18,000 మంది చనిపోయారు. అదే 2010లో పేద దేశం హైతిలో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపానికే లక్ష మంది ప్రజలు చనిపోయారు. భూకంపాలను ఎదుర్కోవడంలో హైతీ సన్నద్ధత అంత పూర్ గా ఉంది.