2019లో ‘‘ప్రధాని’’గా రాహుల్

4 0
Read Time:4 Minute, 34 Second
ప్రతిపక్షాల అభ్యర్ధిగా ప్రతిపాదించిన స్టాలిన్..
‘‘ఫాసిస్టు-నాజీయిస్టు మోడీ’’ని ఓడించే సామర్ధ్యం ఉందని వ్యాఖ్య
‘‘మోడీ శాడిస్టు ప్రధాని’’ అన్న డిఎంకె చీఫ్
కరుణానిధి విగ్రహావిష్కరణకు బీజేపీ వ్యతిరేక నేతలు హాజరు 

బీజేపీ వ్యతిరేక శక్తుల తరఫున ప్రధానమంత్రి అభ్యర్ధిగా రాహుల్ గాంధీ పేరును డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ప్రతిపాదించారు. ‘‘ఫాసిస్టు-నాజీయిస్టు’’ మోడీ ప్రభుత్వాన్ని ఓడించే సామర్ధ్యం రాహుల్ గాంధీకి ఉందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. డిఎంకె మాజీ అధ్యక్షుడు, స్టాలిన్ తండ్రి ఎంకె కరుణానిధి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆదివారం చెన్నైలో జరిగిన సభలో స్టాలిన్ మాట్లాడారు.

కరుణ విగ్రహావిష్కరణకు యుపిఎ ఛైర్మన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి వి. నారాయణసామి, పలు ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. డిఎంకె కార్యాలయమైన అన్నా అరివాలయంలో కరుణానిధి నిలువెత్తు విగ్రహాన్ని సోనియాగాంధీ ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన సభలో ముఖ్య నేతల సమక్షంలోనే… ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీ పేరును స్టాలిన్ ప్రకటించారు.

2004లో ప్రధానమంత్రి వాజ్ పేయి నాయకత్వంలోని ఎన్డీయేకి వ్యతిరేకంగా యుపిఎకి నాయకురాలిగా సోనియాగాంధీ పేరును స్టాలిన్ తండ్రి కరుణానిధి ప్రతిపాదించారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి పాలై సోనియా నాయకత్వాన యుపిఎ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ‘‘దేశ రాజధానిలో నూతన ప్రధానమంత్రిని కూర్చోబెడతాం’’ అని చెన్నై సభలో స్టాలిన్ ఉద్ఘాటించారు. 1980లో ఇందిరాగాంధీ నాయకత్వాన్ని కూడా కరుణానిధి స్వాగతించినట్టు స్టాలిన్ గుర్తు చేశారు. ‘‘కరుణానిధి కుమారుడిగా నేను 2018లో రాహుల్ గాంధీ అభ్యర్ధిత్వాన్ని తమిళనాడు నుంచి ప్రతిపాదిస్తున్నాను’’ అని చెప్పారు.

రాహుల్ గాంధీతో చేతులు కలిపి దేశాన్ని రక్షించాలని ఇతర నేతలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల… దేశంలో సామాజిక సామరస్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ మందగించిందని స్టాలిన్ పేర్కొన్నారు.

మోడీ దేశాన్ని 15 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లారు. మరో ఐదేళ్లు పాలించడానికి అతనికి అవకాశం ఇస్తే దేశం 50 సంవత్సరాలు వెనక్కు పోతుంది.

మోడీ తనను తాను ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా భావించే బదులు… వారసత్వ హక్కు ద్వారా వచ్చిన రాజు తరహాలో అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని స్టాలిన్ ధ్వజమెత్తారు. మోడీ తనను ప్రధానిగానే కాకుండా దేశ అధ్యక్షుడిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, సీబీఐ, ఐటీ అధిపతులుగా కూడా భావిస్తున్నారని విమర్శించారు.

మోడీ ఒక శాడిస్టు ప్రధానమంత్రి. తమిళనాడు వ్యతిరేకించిన పథకాలను అమలు చేశారు. నేను ఈ పదం వాడటానికి కారణం… ఆయన చేసిన విధ్వంసం అంత తీవ్రంగా ఉండటమే..

 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %