తాము ముందుగా నిర్ణయించుకున్నట్టుగా ఈ నెల 21వ తేదనే కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్ధతివ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే మంత్రివర్గంనుంచి తప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో జగన్ గురువారం ప్రకాశం జిల్లా సంతరావూరులో మీడియాతో మాట్లాడారు. ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత… కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలు అశోకగజపతి రాజు, వైఎస్ చౌదరిలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడతారని బుధవారం రాత్రే సమాచారం అందింది. దీంతో… కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస ప్రతిపాదన 21వ తేదీకంటే ముందే చేయవచ్చని, ఆ విషయం జగన్ గురువారం ప్రకటిస్తారని చాలామంది భావించారు. అయితే, జగన్ మాత్రం తాము ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఈ నెల 21వ తేదీనే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని చెప్పారు.
రెండేళ్ల క్రితమే టీడీపీ కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకొని ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా సాకారమయ్యేదని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాకోసం తాము చేసిన ఉద్యమాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు… ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని యు టర్న్ తీసుకున్నారని జగన్ దుయ్యబట్టారు. ప్రజల ఆగ్రహానికి బాబు తలొగ్గారని అభిప్రాయపడ్డారు. తాము 21వ తేదీన ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్ధతు ఇవ్వాలని, లేదంటే చంద్రబాబునాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ సిద్ధపడితే ఇంకా ముందే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమన్నారు. టీడీపీ కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటూనే ఎన్డీయేలో కొనసాగడాన్ని జగన్ తీవ్రంగా ఆక్షేపించారు.
అరుణ్ జైట్లీ బుధవారం కొత్తగా ఏమీ చెప్పలేదని, గతంలోనూ ఆయన అవే చెప్పారని, అప్పుడు చంద్రబాబు స్వాగతించారని జగన్ విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడటం, ఈ నెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించడం వల్లనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ తప్పుకోవలసి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. ప్రజాకాంక్షకు అనుగుణంగా వైసీపీ మొదటినుంచీ ప్రత్యేక హోదాకోసం పోరాడుతోందని, ఇప్పుడు చంద్రబాబు యు టర్న్ ప్రజా విజయమని జగన్ చెప్పారు.
14వ ఆర్థిక సంఘానికి ఏం సంబంధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వకపోవడానికి 14 ఆర్థిక సంఘం సిఫారసులను కారణంగా చూపడాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం 14వ ఆర్థిక సంఘం సాకు చూపిన నేపథ్యంలో… ఆ సంఘానికీ ప్రత్యేక హోదాకూ సంబంధం లేదని జగన్ ఉద్ఘాటించారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలు కాక ముందే… 2014 మార్చి 2వ తేదీన అప్పటి యుపిఎ మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వాలని తీర్మానం చేసిందని గుర్తు చేశారు. మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు కోసం ప్లానింగ్ కమిషన్ కు పంపారని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక కూడా ఏడు నెలలపాటు ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉందని జగన్ చెప్పారు.
కేంద్ర మంత్రివర్గం నిర్ణయం ప్లానింగ్ కమిషన్ లో పెండింగ్ లో ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వకూడదని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మొదటినుంచీ తాము స్పష్టంగా ఉన్నామనీ, హోదాతో ఏమొస్తుంది? అని ప్రశ్నించి చంద్రబాబే మాట మార్చారని ధ్వజమెత్తారు. ఓ అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమవుతుందని, చంద్రబాబు తన అనుకూల మీడియాలో ఆ విధంగా అబద్ధాలను ప్రచారం చేయించారని ఆరోపించారు. హిట్లర్ హయాంలో సమాచార మంత్రిగా పని చేసిన గోబెల్స్ తర్వాత ఆ తరహా ప్రచారంలో చంద్రబాబే సిద్ధహస్తుడని వ్యాఖ్యానించారు.